సీనియర్ న్యాయవాది చౌడమల్ల వీరస్వామికి ‘జాతీయ అంబేద్కర్ అవార్డు’ ప్రదానం!
అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్న వీరస్వామి
సమాజ సేవలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతా
జన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ఘన సన్మానం
శంకరపట్నం (డిసి ప్రతినిధి):
సమాజంలో సోదర భావంతో నిరంతరం సామాజిక సేవలు అందిస్తున్న సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు చౌడమల్ల వీరస్వామికి ప్రతిష్టాత్మక ‘జాతీయ అంబేద్కర్ అవార్డు’ దక్కింది. జన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
సేవలను గుర్తించిన జన సాహిత్య అకాడమీ
మాలా మహానాడు రాష్ట్ర నాయకులు, మాజీ ప్రజాప్రతినిధి అయిన చౌడమల్ల వీరస్వామి సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు పాముల రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఏటా సమాజ సేవకులు, ప్రజా సేవకులను ప్రోత్సహించేందుకు తమ అకాడమీ తరఫున ఈ అవార్డులను అందజేస్తున్నామని చెప్పారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన వీరస్వామి.. మాజీ సర్పంచ్‌గా, మాజీ ఎంపీటీసీగా, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్‌గా రాజకీయంగా, సామాజికంగా ఎన్నో సేవలందించారని కొనియాడారు. సంస్థ నిర్వహించిన ప్రత్యేక సర్వే ఆధారంగానే ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు రమణయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో వీరస్వామికి జాతీయ అంబేద్కర్ అవార్డు మెమొంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు.
“నా సేవలను గుర్తించి జాతీయ అంబేద్కర్ అవార్డుకు ఎంపిక చేసిన జన సాహిత్య అకాడమీ నిర్వాహకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పురస్కారం నాపై మరింత బాధ్యతను పెంచింది. భవిష్యత్తులో ఎలాంటి స్వార్థం లేని నిస్వార్థమైన సమాజ సేవ చేయడానికి, సోదర భావంతో ప్రతి ఒక్కరికీ అండగా నిలవడానికి మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను.”
– చౌడమల్ల వీరస్వామి, జాతీయ అంబేద్కర్ అవార్డు గ్రహీత
వెల్లువెత్తిన అభినందనలు
చౌడమల్ల వీరస్వామికి జాతీయ స్థాయి అవార్డు దక్కడంపై శంకరపట్నం మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన తోటి న్యాయవాదులు, మాల మహానాడు నాయకులు వీరస్వామిని కలిసి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.
