బాధితులకు చేరిన ‘పోగొట్టుకున్న’ ఫోన్లు.. రూ. 12 లక్షల విలువైన ఫోన్లను రికవరీ చేసిన వన్‌టౌన్ పోలీసులు

సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 31 మొబైల్స్ రికవరీ
బాధితులకు మొబైల్స్ అందజేసిన టౌన్ ఏసీపీ వెంకటస్వామి

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో కరీంనగర్ వన్‌టౌన్ పోలీసులు మంచి ఫలితాలను సాధించారు. సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా ట్రేస్ చేసిన సుమారు రూ.12 లక్షల విలువైన 31 మొబైల్ ఫోన్లను కరీంనగర్ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితులకు అధికారికంగా అప్పగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టౌన్ ఏసీపీ వెంకటస్వామి రికవరీ చేసిన ఫోన్లను వాటి అసలు యజమానులకు అందజేశారు.

ఫోన్ పోతే వెంటనే ఫిర్యాదు చేయండి: ఏసీపీ వెంకటస్వామి
ఈ సందర్భంగా ఏసీపీ వెంకటస్వామి మాట్లాడుతూ, ప్రజలు తమ మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా లేదా చోరీకి గురైనా ఆందోళన చెందకుండా వెంటనే స్పందించాలని సూచించారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CEIR పోర్టల్ ద్వారా వివరాలను నమోదు చేసుకుంటే, సదరు ఫోన్లను త్వరగా గుర్తించి తిరిగి దక్కించుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని స్పష్టం చేశారు.

పోలీస్ సిబ్బందికి అభినందనలు: ఈ రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించి, బాధితులకు వారి ఫోన్లను చేర్చడంలో విశేష కృషి చేసిన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రాంచందర్ రావుతో పాటు పోలీస్ సిబ్బందిని ఏసీపీ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. కోల్పోయిన తమ విలువైన ఫోన్లు తిరిగి చేతికందడంతో బాధితులు పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

2050 నాటికి క్యాన్సర్ కేసులు రెట్టింపు  .. WHO కీలక సూచనలు

అంతరిక్షంలోకి వ్యోమగామి ‘అనిల్ మీనన్’.. నాసా ప్రతిష్టాత్మక మిషన్ విశేషాలు ఇవే!