కరీంనగర్ జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎండి కాలనీలోని దుర్గాబాయి దేశ్ ముక్ మహిళా శిశు వికాస కేంద్రంలో మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీ కె. వెంకటేష్ గారు నేతృత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. “ప్రతి వ్యక్తి ఒక మొక్కను నాటి, పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి. మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్‌ను గ్రహించి మనకు జీవనవాయువు (ఆక్సిజన్)ను అందిస్తాయి. వృక్షో రక్షతి రక్షితః – మనం వృక్షాలను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి” అని సూచించారు.
ఈ సందర్భంగా వాతావరణ మార్పులకు కారణమైన అంశాలు, వాటి పరిష్కార మార్గాలు గురించి చర్చించారు. ముఖ్యంగా వృక్షాల నిర్లక్ష్యం వల్ల కలిగే ప్రభావాలపై అవగాహన కల్పించారు. అలాగే, పర్యావరణ, గృహ హింస నిరోధక చట్టాలు మరియు మోటారు వాహనాల చట్టాలపై కూడా మహిళలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శితో పాటు, మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ సుధారాణి, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేష్, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు అవుదరి కిరణ్ కుమార్ మరియు ఇతర నిర్వాహకులు పాల్గొన్నారు.

