Telangana” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ ముఖ్యులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పాల్గొన్నారు. వారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను విడివిడిగా కలిసి తమ డిమాండ్లను వినిపించారు.
ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. మాదిగలు రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న సామాజిక వర్గంగా, జనాభా నిష్పత్తితో పాటు సామాజిక సమీకరణల దృష్టితోనూ వారికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించడం అవసరమని వారు పేర్కొన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం మాదిగలు 33 లక్షల మందికి పైగా ఉన్నారు. తాజా అంచనాల ప్రకారం, ఈ సంఖ్య రెట్టింపవడంతో మాదిగలకు మంత్రివర్గ స్థానం ఇవ్వాల్సిన అవసరం మరింత పెరిగిందని వారు గుర్తు చేశారు.
తమ వర్గానికి న్యాయం జరగాలన్న ఆశతో మాదిగలు ఎదురుచూస్తున్నారని, ఈ మంత్రివర్గ విస్తరణలో వారి ఆశలు నెరవేర్చాల్సిన సమయం ఇదే అని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరేలా కూడా ఇది సహకరిస్తుందని వారు పేర్కొన్నారు.
అలాగే, ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ నేతృత్వంలో ఒక ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసి వేగంగా స్పందించారని గుర్తు చేస్తూ, అదే విధంగా మంత్రివర్గ విస్తరణలోనూ న్యాయం జరగాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
