lingapur” శంకరపట్నం, కరీంనగర్ జిల్లా:
కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలానికి చెందిన లింగాపూర్ గ్రామంలో ఓ రైతు ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
స్థానికులు అందించిన వివరాల ప్రకారం, లింగాపూర్ గ్రామానికి చెందిన అంతం బాపిరెడ్డి అనే రైతు, పక్కనే ఉన్న కొత్తగట్టు గ్రామానికి చెందిన తన బంధువుకు సంబంధించిన వ్యవసాయ బావి వద్ద మోటార్‌ను మరమ్మతు చేస్తుండగా, అనూహ్యంగా ఆయన కాలుజారి బావిలో పడిపోయారు. బావిలో పడిన సమయంలో తలకు బలమైన గాయం కావడంతో బాపిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
బాపిరెడ్డి సహాయక స్వభావం కలిగినవాడిగా గ్రామస్తుల్లో మంచి పేరుపొందారు. వ్యవసాయ మోటార్ల సమస్యలు స్నేహభావంతో పరిష్కరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆయన ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
ప్రమాద సమాచారం అందుకున్న కేశవపట్నం ఎస్ఐ కట్కూరి శేఖర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
