indiramma illu” రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం, బిల్లుల చెల్లింపుల్లో అనేక అవకతవకలపై ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం వాటిపై విచారణ కొనసాగుతోందని, విచారణ పూర్తైన తర్వాతే పెండింగ్ బిల్లుల చెల్లింపుపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తమ నియోజకవర్గాల్లో బిల్లులు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాంకేతిక కారణాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే మంజూరైన ఇళ్లతో పాటు అదనంగా మరిన్ని ఇళ్లను కూడా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి స్పందిస్తూ, గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ఎలాంటి భేషజాలు లేకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించామని, మధ్యలో నిలిచిపోయిన ఇళ్లకు నిధులు విడుదల చేసి నిర్మాణాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
గత పదేళ్ల కాలంలో కమిషన్ల కోసమే పాలకులు పని చేశారని, అప్పుడే ఇళ్ల నిర్మాణం పూర్తయ్యి ఉంటే పేదలకు ఈ ఇబ్బందులు వచ్చేవి కావని మంత్రి వ్యాఖ్యానించారు. అరకొర ఇళ్లే నిర్మించి ప్రజలను నిరాశకు గురి చేశారని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెంచు గిరిజనులకు తొలి విడతలోనే ఇళ్లను మంజూరు చేశామని, గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం అవసరమైన స్థలాలను కూడా గుర్తిస్తున్నామని చెప్పారు.
పేదల ఆత్మగౌరవానికి సంబంధించిన గృహ నిర్మాణ విషయంలో ఎలాంటి రాజీ పడబోమని, అర్హులందరికీ తప్పకుండా ఇళ్లు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
