కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌లో కూలి మహిళ లక్ష్మిని బావిలోకి తోసి, నగలు దోచుకెళ్లిన సంచలన కేసును కరీంనగర్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది మరెవరో కాదు.. చదువుకోవాల్సిన ఒక డిగ్రీ విద్యార్థి అని పోలీసులు తేల్చారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ (జూదం), లోన్ యాప్‌ల వేధింపుల వల్లే ఈ ఘోరానికి పాల్పడినట్లు కరీంనగర్ పోలీస్ కమిషనర్ (CP) మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
రూ. 4 లక్షల జూదం నష్టం.. లోన్ యాప్‌ల ఒత్తిడి:
పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. గొల్లపల్లి గ్రామానికి చెందిన దినేష్ రెడ్డి (21) అనే యువకుడు కరీంనగర్ నగరంలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అతడు DIUWIN, జియో లాటరీ వంటి ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్, కలర్ ట్రేడింగ్ యాప్స్‌కు బానిసయ్యాడు. ఈ జూదంలో దాదాపు రూ. 4 లక్షలు నష్టపోయాడు.
ఆ అప్పులు తీర్చడానికి పలు ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నాడు. కొద్దిరోజులుగా లోన్ యాప్ నిర్వాహకుల నుంచి తీవ్రమైన వసూళ్ల ఒత్తిడి, వేధింపులు ఎక్కువయ్యాయి. దాంతో ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో క్రైమ్ రూట్ ఎంచుకున్నాడు. వారం రోజుల ముందే నగరంలో రెక్కీ నిర్వహించి ఈ నేరానికి పక్కా స్కెచ్ వేశాడు.
కూలి అని నమ్మించి.. తాడు కత్తిరించి క్రూరత్వం!
ఈ నెల 1వ తేదీన ఉదయం కరీంనగర్ టవర్ సర్కిల్ లేబర్ అడ్డా వద్ద కూలి పని కోసం వేచి ఉన్న గంగాధర లక్ష్మి (55) అనే మహిళను దినేష్ రెడ్డి టార్గెట్ చేశాడు. పని ఇప్పిస్తానని నమ్మించి, ర్యాపిడో బైక్‌పై ఆమెను నుస్తులాపూర్ గ్రామ శివారులోని పొలాల వైపు తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై దాడి చేసి 5 గ్రాముల బంగారు ఆభరణాలు (పుస్తెలు, గుండ్లు, చెవిపోగు), 20 గ్రాముల వెండి మట్టెలను దోచుకున్నాడు.
మహిళ బ్రతికి ఉంటే తను దొరికిపోతానని భావించిన దినేష్, లక్ష్మిని వ్యవసాయ బావిలోకి తోసివేశాడు. బాధితురాలు ప్రాణాలు కాపాడుకునేందుకు బావిలో ఉన్న తాడును పట్టుకోగా.. నిందితుడు అత్యంత క్రూరంగా ఆ తాడును కూడా కత్తితో కత్తిరించి అక్కడ నుంచి పరారయ్యాడు.
ప్రాణాలు కాపాడిన ఈత..
బాధితురాలికి ఈత రావడంతో, బావిలో మోటార్ పైపులకు కట్టిన మరో తాడును పట్టుకుని రాత్రంతా ప్రాణభయంతో నీటిలోనే గడిపింది. మరుసటి రోజు ఉదయం రైతులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం.. దర్యాప్తులో కిడ్నాప్ మరియు హత్యాయత్నంగా తేలింది.
నిందితుడితో పాటు నగల వ్యాపారి కూడా అరెస్ట్:
పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు దినేష్ రెడ్డిని కరీంనగర్ అమరవీరుల స్థూపం వద్ద అదుపులోకి తీసుకున్నారు. అలాగే దొంగిలించిన సొత్తును కొనుగోలు చేసిన టవర్ సర్కిల్‌కు చెందిన నగల వ్యాపారి వేణు మనోహర చారిని కూడా అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి బంగారు పుస్తెలు, గుండ్లను రికవరీ చేశారు.
అత్యంత వేగంగా కేసును ఛేదించిన ఏసీపీ వెంకటస్వామి, ఇన్స్పెక్టర్లు కె. రామచందర్ రావు, తిరుమల్, ఎస్సైలు సుమన్, చేరాలు, భాస్కర్ మరియు పోలీస్ సిబ్బందిని కరీంనగర్ సీపీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.
