జయశంకర్ భూపాలపల్లి | న్యూస్ డెస్క్
కొన్ని జిల్లాలను రద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్వయంగా స్పష్టతనిచ్చారు.
ఏ జిల్లాను రద్దు చేయడం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన తేల్చిచెప్పారు.
ప్రజా పాలన – ప్రగతి బాట సభలో సీఎం కీలక వ్యాఖ్యలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
“జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదు. భవిష్యత్తులో ఏమైనా మార్పులు అవసరమైతే, బహిరంగంగా ప్రజలకు తెలియజేసి, శాసనసభలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
భూపాలపల్లి జిల్లా రద్దు వార్తలు తప్పుడు ప్రచారమే
జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు విష ప్రచారం అని సీఎం రేవంత్ రెడ్డి ఖండించారు.
“భూపాలపల్లి చైతన్యవంతమైన ప్రాంతం. కుట్రలు, కుతంత్రాలతో చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు గుర్తిస్తారు. భూపాలపల్లిని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాం” అని తెలిపారు.
సింగరేణి మెడికల్ బోర్డు రద్దు లేదు
సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ కొందరు కావాలని అపోహలు సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు.
“సింగరేణి కార్మికుల ప్రయోజనాలకు భంగం కలిగే నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకోదు. మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదు. సింగరేణి కార్మికులు ఈ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచారు” అని చెప్పారు.
2027 పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక
2027లో జరగనున్న పుష్కరాలపై సీఎం కీలక ప్రకటన చేశారు.
-
బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఆలయాలను పర్యాటక పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి
-
అటవీ ప్రాంతాల్లో రిసార్టుల నిర్మాణం
-
పర్యాటక రంగానికి కొత్త ఊపు
అభివృద్ధి పనులకు వేల కోట్ల కేటాయింపు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మున్సిపాలిటీల అభివృద్ధి కోసం రూ. 6,116 కోట్లు కేటాయించినట్లు సీఎం వెల్లడించారు.
తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ – ఉస్మానియా విశ్వవిద్యాలయాల పాత్రను గుర్తుచేశారు.
మహిళా సంఘాలకు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ
ఈ బహిరంగ సభ వేదికపై నుంచే ‘సమ్మక్క – సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు రూ.205 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
