కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లాలంటే భక్తులకు చాలా ఇబ్బందిగా ఉండేది కానీ ఇప్పటి నుంచి సులభం కానుంది. ఎక్కువగా తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో వెళ్తుండటంతో రైలు ప్రయాణం కష్టంగా ఉండేది. ప్రస్తుతం వారానికి రెండు రోజులు మాత్రమే కరీంనగర్ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటున్నాయి. అది కూడా ఆదివారం, గురువారాలు వెళ్తున్నాయి. అయితే ఇక నుండి వారానికి నాలుగు రోజులు వెళ్లనుంది. ఇది భక్తులకు ఉపశమనం కలిగించే వార్త. ఇదంతా దృష్టిలో పెట్టుకుని ఎంపీ బండి సంజయ్ కుమారు శుక్రవారం డిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు. కరీంనగర్ నుంచి తిరుపతికి ప్రస్తుతానికి రెండు రైళ్లు మాత్రమే వెళ్తున్నాయని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుపతికి వెళ్తుండటంతో అంతదూరం ప్రయాణం కష్టంగా ఉందని వెల్లడించారు. రైళ్లు పెంచాలని కోరినట్టు తెలిపారు. స్పందించిన మంత్రి ఇప్పటి నుంచి అదనంగా రెండు రోజులు అంటే మొత్తం వారానికి నాలుగు రోజులు కరీంనగర్ నుంచి తిరుపతికి రైళ్లను నడిపిస్తామని హామీనిచ్చారని చెప్పుకొచ్చారు. వెంటనే రైళ్లను పెంచేందుకు కసరత్తు చేయాలని దక్షణమధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
కరీంనగర్ – హసన్‌పర్తి పనులు పూర్తిచేయాలి…
కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే ఫైనల్ లొకేషన్ సర్వే పనులు పూర్తిచేయాలని, కొత్త రైల్వేలైన్ మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని మంత్రిని కోరినట్టు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
రైళ్లను జమ్మికుంటలో ఆపాలని విజ్ఞప్తి…
ఎంపీ బండి సంజయ్ కుమార్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి జమ్మికుంటలో ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వ్యాపారాల రీత్య, పలు అవసరాల కోసం నిత్యం ప్రయాణం చేస్తుంటారని తెలిపారు. గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దానాపూర్ ఎక్స్‌ప్రెస్, నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లను జమ్మికుంటలో నిలిపేలా కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్‌కు సంబంధించి డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని విజ్ఞప్తిచేశారు. స్పందించిన మంత్రి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.