నాగర్‌కర్నూలు: సాధారణంగా ఏదైనా పరీక్ష జరుగుతుందంటే సెంటర్లు విద్యార్థులతో కిటకిటలాడుతుంటాయి. కానీ నాగర్‌కర్నూలు జిల్లాలో మాత్రం ఒకే ఒక్క విద్యార్థి కోసం అధికారులు ప్రత్యేకంగా ఒక పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇది వినడానికి వింతగా ఉన్నా అక్షరాలా నిజం. అయితే, ఇంత చేసినా చివరికి ఆ విద్యార్థి అధికారులకు కోలుకోలేని షాకిచ్చాడు.
అసలేం జరిగిందంటే? జిల్లాలో ఇటీవల ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థుల కోసం బ్రిడ్జి కోర్సు పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానించారు. అయితే ఈ పరీక్ష రాసేందుకు జిల్లా వ్యాప్తంగా వరుణ్ సందేశ్ అనే ఒకే ఒక్క విద్యార్థి దరఖాస్తు చేసుకున్నాడు. జనరల్ బ్రిడ్జి కోర్స్ మ్యాథమేటిక్స్ పరీక్ష రాసేందుకు అతను ఫీజు కూడా చెల్లించాడు.
అధికారుల భారీ ఏర్పాట్లు: ఒక్కడే కదా అని అధికారులు నిర్లక్ష్యం చేయలేదు. ఆ విద్యార్థికి ఉన్న ఆసక్తిని గౌరవిస్తూ, నిబంధనల ప్రకారం జిల్లాలో ఒక పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్ష నిర్వహణ కోసం ఒక ఇన్విజిలేటర్, ఒక సూపరింటెండెంట్‌ను కూడా నియమించారు. అంతేకాకుండా, పరీక్షా కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
తీరా పరీక్ష సమయానికి.. నిర్దేశించిన సమయానికి అధికారులు, సిబ్బంది, పోలీసులు అంతా రెడీగా ఉన్నారు. కానీ ఎవరి కోసం అయితే ఇన్ని ఏర్పాట్లు చేశారో, ఆ విద్యార్థి మాత్రం పరీక్షా కేంద్రానికి రాలేదు. పరీక్షకు డుమ్మా కొట్టడంతో అధికారులు అవాక్కయ్యారు. ఒక్క విద్యార్థి కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు, సిబ్బంది శ్రమ అంతా వృథా కావడంతో ఈ విషయం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
