Rajanna sircilla” రాజన్న సిరిసిల్ల: సాంకేతికతను అందిపుచ్చుకోవడంలోనే కాదు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలోనూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను వెలికితీయడంలో (Mobile Recovery) అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా పోలీసు యంత్రాంగం, దక్షిణాది రాష్ట్రాల్లోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
రికార్డు స్థాయిలో 78% రికవరీ రేటు
కేంద్ర ప్రభుత్వ CEIR (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్‌ను సమర్థవంతంగా వినియోగించుకోవడంలో సిరిసిల్ల పోలీసులు రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు జిల్లాలో వివిధ సందర్భాల్లో పోయిన 2,286 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఏకంగా 78 శాతం రికవరీ రేటు సాధించి, దక్షిణాది రాష్ట్రాల్లో మరే జిల్లాకు సాధ్యం కాని ఘనతను సాధించారు.
రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రశంసలు
జిల్లా పోలీసుల అంకితభావాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ నిర్వహించిన సర్వేలో సౌత్ ఇండియా లెవెల్‌లో జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఆధునిక డిజిటల్ ట్రాకింగ్ విధానాలను సిబ్బంది సమర్థంగా వాడటం వల్లే ఇది సాధ్యమైందని కొనియాడారు.
జాతీయ వేదికపై జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే
ఈ విశిష్ట విజయానికి గుర్తింపుగా ఈ నెల 12న కేరళలోని ఎర్నాకులంలో జాతీయ స్థాయి సదస్సు నిర్వహించనున్నారు. ఈ సదస్సులో జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పాల్గొని, మొబైల్ రికవరీలో తాము అనుసరించిన వ్యూహాలు మరియు సాంకేతిక మెళకువలను వివరించి, కేంద్ర ప్రభుత్వం తరపున అవార్డును అందుకోనున్నారు.
పోలీస్ సేవలను వినియోగించుకోవాలి: ఎస్పీ
ఈ విజయంపై జిల్లా ఎస్పీ స్పందిస్తూ.. “ఇది టీమ్ వర్క్ విజయం. ప్రజలు తమ ఫోన్లు పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా భయం వీడి వెంటనే పోలీస్ స్టేషన్‌లో లేదా CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి” అని సూచించారు. ఈ క్రమంలో విశేష కృషి చేసిన ఐటీ కోర్ ఎస్ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ తిరుమలేష్ మరియు ఇతర సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
