Rishabh panth” భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్‌ల సిరీస్ లో రిషబ్ పంత్ అద్భుత ఫార్మ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా సెంచరీలు సాధించి టీమిండియా ఫ్యాన్స్‌ను మంత్రముగ్ధులను చేశాడు. ఇప్పుడతను మరో సంచలనానికి సిద్ధమవుతున్నాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు అనే రికార్డును బ్రేక్ చేయడానికి పంత్ ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు.
ప్రస్తుతం ఈ రికార్డు భారత దిగ్గజం విరాట్ కోహ్లీ పేరిట ఉంది, అతను ఇంగ్లాండ్‌పై ఐదు టెస్ట్ సెంచరీలు సాధించాడు. పంత్‌కు ఇప్పటికే అంతే సంఖ్యలో సెంచరీలు ఉండగా, ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో మరో సెంచరీ సాధిస్తే కోహ్లీని అధిగమించనున్నాడు.
విరాట్ రిటైర్మెంట్ తర్వాత కొత్త ఛాప్టర్
ఈ సిరీస్‌కు ముందే విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడంతో, ఈ ఫార్మాట్లో ఇకపై అతని ఆట చూడలేము. దీంతో, పంత్ లాంటి యువ ఆటగాళ్లకు కొత్త రికార్డులు సృష్టించుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో పంత్ పేరు మరోసారి భారత క్రికెట్ చరిత్రలో నిలవబోతుంది.
శుభ్‌మాన్ గిల్ – మరో రికార్డు దిశగా
భారత కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా ఇంగ్లాండ్‌లో రెండు సెంచరీలు సాధించిన కెప్టెన్‌గా నిలిచేందుకు సన్నద్ధమవుతున్నాడు. అతని ఖాతాలో ఇప్పటికే రెండు శతకాలు ఉన్నాయి. మరో సెంచరీ వస్తే, కోహ్లీ, అజారుద్దీన్ సరసన చేరతాడు.
బౌలింగ్ విభాగంలో మార్పులు?
తొలి టెస్ట్ మ్యాచ్‌లో స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగిన భారత జట్టు, రెండో టెస్ట్‌లో మాత్రం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు అవకాశం ఇవ్వనుందన్న సమాచారం వినిపిస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ పిచ్ టర్న్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో, కుల్దీప్ కీలక పాత్ర పోషించవచ్చని అంటున్నారు.
ఇక పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌ను తీసుకునే యోచనలో మేనేజ్మెంట్ ఉన్నట్టు వార్తలు వచ్చాయి. బుమ్రా విశ్రాంతి తీసుకునే అవకాశం ఉన్నా, అతను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం గమనార్హం.
పిచ్ విశ్లేషణ – నాలుగో ఇన్నింగ్స్ కష్టమే
ఎడ్జ్‌బాస్టన్ పిచ్‌పై నాలుగో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయడం చాలానే కష్టంగా మారుతుంది. గత గణాంకాల ప్రకారం మొదటి ఇన్నింగ్స్‌లో 300+ స్కోరు సాధ్యమైనా, నాలుగో ఇన్నింగ్స్‌లో స్కోరు 170–200 మధ్యే ఉండే అవకాశముంది. దాంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాలనే నిర్ణయం తీసుకునే అవకాశం ఎక్కువ.
