Sankranthi”జనవరి 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు

Sankranthi” తెలంగాణ ప్రభుత్వం అధికారిక ప్రకటన

హైదరాబాద్, జనవరి 6:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

ఈ సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య (కామర్షియల్) పాఠశాలలకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అదేవిధంగా జనవరి 16వ తేదీన కనుమ పండుగను పురస్కరించుకుని ఐచ్ఛిక సెలవు కూడా ప్రకటించినట్లు తెలిపింది.

కనుమ పండుగను రైతులు ప్రత్యేకంగా జరుపుకునే పండుగగా భావిస్తారని, ఆ రోజున సంప్రదాయ ఉత్సవాలు, పండుగ సంబరాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని ప్రభుత్వం పేర్కొంది.

సంక్రాంతి సెలవులు ముగిసిన అనంతరం జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హాస్టళ్లలో ఉండే విద్యార్థులను ఇంటికి తీసుకురావడానికి తల్లిదండ్రులు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ర్యాంకులే చదువుకు కొలమానం కాదు

పిల్లలపై ఒత్తిడి పెడితే దుష్పరిణామాలు: పోలీసుల సూచన

హైదరాబాద్, జనవరి 6:
ఇటీవల గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తల్లిదండ్రులకు కీలక సూచనలు చేశారు. పిల్లలపై చదువుల విషయంలో అధిక ఒత్తిడి పెంచరాదని, అది తీవ్ర మానసిక ప్రభావాలకు దారితీస్తుందని హెచ్చరించారు.

బడికి వెళ్లేందుకు సిద్ధం కావాలని తల్లిదండ్రులు చెప్పడంతో ఇష్టంలేని బాలుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సమాజాన్ని కలచివేసిందన్నారు. చదువుల ఒత్తిడితో విద్యార్థులు జీవితంలో ఇక మార్గం లేదన్న భావనకు లోనై, తమ జీవితాలకు తామే ముగింపు పలుకుతున్న పరిస్థితి ఆందోళనకరమని పేర్కొన్నారు.

పోలీసులు మాట్లాడుతూ, పరీక్షలు జీవితంలో ఒక భాగం మాత్రమేనని, పరీక్షలే జీవితం కాదని స్పష్టం చేశారు. కేవలం చదువే కాదు, కష్టపడి పని చేయడం, విషయ పరిజ్ఞానం, అభిరుచి, పట్టుదలతో కూడా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. చరిత్రలో అనేక మంది గొప్ప వ్యక్తులు చదువులో సాధారణంగా ఉన్నప్పటికీ, తమ కృషితో అద్భుత విజయాలు సాధించిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు.

అబ్రహాం లింకన్ నిరుపేద కుటుంబంలో పుట్టి అనేక కష్టాలు ఎదుర్కొని అమెరికా అధ్యక్షుడిగా ఎదిగారని, శ్రీనివాస రామానుజన్‌, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌, స్టీవ్ జాబ్స్‌, మైఖేల్ ఫారడే, మార్క్ ట్వెయిన్‌, విన్‌స్టన్ చర్చిల్‌, రజనీకాంత్‌, నవాజుద్దీన్ సిద్దికీ వంటి వారు తమ పట్టుదలతోనే గొప్ప గుర్తింపు సాధించారని తెలిపారు.

ర్యాంకులు, మార్కులు, ఇతర విద్యార్థులతో పోలికలు విద్యార్థులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని, చదువు మనిషిని సంస్కరించాలి కానీ అతని జీవితాన్ని నాశనం చేయకూడదని పేర్కొన్నారు. గెలుపు–ఓటములు జీవితం లో సహజమని, ఓటమి వచ్చినప్పుడు భయపడకుండా దానినుంచి పాఠాలు నేర్చుకొని ముందుకు సాగాలని సూచించారు.

వాల్ట్ డిస్నీ, థామస్ ఆల్వా ఎడిసన్‌, అలెగ్జాండర్ గ్రాహం బెల్‌, రైట్ బ్రదర్స్‌, టెంజింగ్ నార్గే వంటి వారు అనేక విఫలాల తర్వాతే విజయం సాధించారని గుర్తు చేశారు. విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తుపై స్పష్టమైన ప్రణాళికలు రూపొందించుకొని, తమకు ఇష్టమైన రంగంలో ముందుకు సాగాలని పోలీసు అధికారులు సూచించారు.

తల్లిదండ్రులు పిల్లలపై ప్రేమతో, ఓర్పుతో వ్యవహరించి వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని, విద్యార్థులు తమ జీవితాన్ని విలువైనదిగా భావించి ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *