రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శన ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ |  

తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కార్టూన్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనను ఎస్ఆర్ఆర్ కళాశాల తెలుగు విభాగం సహకారంతో సోమ, మంగళవారాల్లో నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ కార్టూనిస్టుల కళాఖండాలు ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో పాటు సమాజాన్ని ఆలోచింపజేస్తున్నాయని పేర్కొన్నారు. యువతను కార్టూన్ రంగం వైపు ప్రోత్సహించాలని, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోటీల్లో తెలంగాణ కార్టూనిస్టులు పాల్గొని విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి, రిప్రెజెంటేటివ్ పర్సన్ కళ్యాణం శ్రీనివాస్, ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట రామకృష్ణ, తెలుగు విభాగం అధ్యాపకులు, కార్టూనిస్టులు తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేక అధికారులు ప్రతి పాఠశాలను సందర్శించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

కరీంనగర్ | 

జిల్లాలోని ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా సందర్శించి, అక్కడి మౌలిక వసతులు సహా పలు అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ నెలాఖరులోపు జిల్లాలోని అన్ని పాఠశాలలను ప్రత్యేక అధికారులు సందర్శించాలని సూచించారు.

పదవ తరగతి పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక తరగతుల నిర్వహణ, ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ల వినియోగం, విటమిన్ గార్డెన్ నిర్వహణ, ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు మరియు నిర్వహణ వంటి అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని తెలిపారు. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లు వాడుతున్నారా లేదా అన్నది పరిశీలించాలని, మధ్యాహ్న భోజన నాణ్యతను తనిఖీ చేయాలని ఆదేశించారు.

అలాగే టాయిలెట్లు, తాగునీరు తదితర మౌలిక వసతులను పరిశీలించి ఏవైనా అవసరాలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వర్షపు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు ఎక్కడెక్కడ చేపట్టారో వాటికి సంబంధించిన ఫోటోలను జీపీఎస్ ఆధారంగా నిర్దిష్ట వెబ్‌సైట్‌లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ, పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిలబస్‌ను పూర్తిచేసి నిర్దిష్టమైన పరీక్షలు నిర్వహించాలని సూచించారు. విటమిన్ గార్డెన్ల నిర్వహణతో పాటు సాయంత్రం తరగతులను కూడా ప్రత్యేక అధికారులు పరిశీలించాలని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఐదు క్లబ్బులు ఏర్పాటు చేసినట్లు పేర్కొని, వాటి పనితీరును సమీక్షించాలని సూచించారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.


‘ప్రజావాణి’కి 250 దరఖాస్తులు

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్‌తో కలిసి జిల్లా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు.

కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించగా, మరికొన్నింటిని సంబంధిత అధికారులకు బదిలీ చేశారు. మొత్తం 250 దరఖాస్తులు ప్రజావాణి కార్యక్రమంలో అందాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *