Acpmadhavi” ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం : ఏసీపీ వి. మాధవి
నేటి కరీంనగర్ | శంకరపట్నం
గ్రామీణ ప్రాంతాల్లో నేరాలు, ఘోరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, నేటి సాంకేతిక పరిజ్ఞానం గ్రామాల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి అన్నారు. ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరమని ఆమె సూచించారు.
సోమవారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం, కేశవపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని మొలంగూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఏసీపీ వి. మాధవి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో కీలకంగా మారాయని తెలిపారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, ప్రతి కాలనీ, గ్రామంలో వీటి ఏర్పాటు వల్ల అనుమానాస్పద కదలికలు, అసాంఘిక కార్యకలాపాలను సులభంగా గుర్తించవచ్చని పేర్కొన్నారు.
ప్రతి కాలనీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామ ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, వ్యాపార వర్గాలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వ్యాపార సముదాయాల వద్ద యజమానులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మొలంగూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పూదరి రాజు నేరాలను అరికట్టే ఉద్దేశంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఏసీపీ మాధవి ప్రశంసించారు. సీసీ కెమెరాల వల్ల గ్రామ ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందని, శాంతి నెలకొని ప్రజలు ప్రశాంతంగా జీవించవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు జరగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్, కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పూదరి రాజు, ఉప సర్పంచ్ దండు రాజేష్, మాజీ సర్పంచులు దండు సాయిలు, మోరె అనూష శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ వావిలాల రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
///////////////////////////////////////////
“మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు,
ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది” : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
బ్లాక్ స్పాట్ల సందర్శన – రోడ్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు
రామగుండం, మదర్ న్యూస్ ప్రతి నిది:
“మద్యం సేవించి వాహనం నడపడం ఒక వ్యక్తినే కాదు, ఒక కుటుంబం మొత్తపు జీవితాన్ని నాశనం చేస్తుంది” అని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజున బ్లాక్ స్పాట్ల సందర్శన, రోడ్డు భద్రత మరియు డ్రంక్ అండ్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్, పెద్దపల్లి జోన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధి మేడిపల్లి సెంటర్ వద్ద ఉన్న బ్లాక్ స్పాట్‌ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్‌లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు రోడ్డు భద్రత, మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కలిగే నష్టాలు, అనర్థాలపై అవగాహన కల్పించారు.
సీపీ గారు మాట్లాడుతూ, పెద్దపల్లి–మంచిర్యాల జోన్ పరిధిలో పోలీస్ అధికారులు మరియు ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో కలిసి బ్లాక్ స్పాట్లను సందర్శించి, వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాల వల్ల ఒక వ్యక్తితో పాటు ఒక కుటుంబం మొత్తం జీవితం ఎలా ప్రభావితమవుతుందో ప్రజలకు, వాహనదారులకు వివరించారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలు, చట్టపరమైన పరిణామాలపై కూడా సవివరంగా తెలియజేశారు.
మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాలు, జైలు శిక్ష లేదా సామాజిక సేవ (సోషల్ సర్వీస్) విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించడం ఎంత ముఖ్యమో వివరించారు. మద్యం మత్తులో నిర్లక్ష్యంగా వాహనం నడిపితే ప్రాణాంతక ప్రమాదాలు సంభవిస్తాయని హెచ్చరించారు.
మద్యం సేవించి రాంగ్ రూట్‌లో వాహనం నడపడం, సిగ్నల్ జంపింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలు మరియు వాటిపై తీసుకునే చట్టపరమైన చర్యల గురించి తెలియజేశారు. మత్తులో అతివేగంగా వాహనం నడపడం, ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్ ప్రాణాలకు ముప్పు అని స్పష్టం చేశారు.
మద్యం సేవించి వాహనం నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం, అవసరమైతే జైలు శిక్ష కూడా విధించబడుతుందని తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదం జరిగితే, అది హత్యకు సమానమైన నేరం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి అయితే, శిక్ష పడిన పక్షంలో సస్పెన్షన్ చర్యలు తప్పవని తెలిపారు. సురక్షితంగా రోడ్డు దాటడం, లేన్ డిసిప్లిన్ పాటించడం ఎంత ముఖ్యమో కూడా వాహనదారులకు వివరించారు.
మద్యం సేవించి, అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదన మరియు కుటుంబంపై పడిన తీవ్ర ప్రభావం గురించి ప్రజలకు, వాహనదారులకు వివరించారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్రజలందరూ మద్యం సేవించి వాహనం నడపకుండా, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ తమ కుటుంబాలను, సమాజాన్ని సురక్షితంగా ఉంచాలని అధికారులు కోరారు.
ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్ కిరణ్, ట్రాఫిక్ ఎస్సై హరీశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
