లక్నో/ఘజియాబాద్: స్మార్ట్‌ఫోన్ వ్యసనం, ఆన్లైన్ గేమ్‌ల మాయాజాలం మరో నిండు ప్రాణాలను బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముగ్గురు మైనర్ అక్కాచెల్లెళ్లు ఆన్లైన్ గేమ్ మరియు కొరియన్ సంస్కృతికి బానిసలై, తమ నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 9వ అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన బుధవారం తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఘటన వివరాలు:
-
మృతులు: నిషిక (16), ప్రాచి (14), పాఖి (12). వీరు ముగ్గురూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత అన్యోన్యంగా ఉండేవారు.
-
కారణం: కోవిడ్ సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం మొబైల్ వాడటం మొదలుపెట్టిన వీరు, క్రమంగా ‘కొరియన్ లవ్ గేమ్’ వంటి టాస్క్ ఆధారిత గేమ్‌లకు, కొరియన్ డ్రామాలకు బానిసలయ్యారు. తమను తాము కొరియన్లుగా భావించుకుంటూ పేర్లు కూడా మార్చుకున్నారు.
-
పెరిగిన దూరం: గేమ్‌ల పిచ్చితో స్కూలుకు వెళ్లడం మానేశారు. దీనిపై తల్లిదండ్రులు మందలించి, మొబైల్ ఫోన్లు లాక్కోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొరియన్ సంస్కృతికి దూరమై జీవించలేమని భావించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
8 పేజీల సూసైడ్ నోట్:
పోలీసులు వారి గదిని తనిఖీ చేయగా 8 పేజీల డైరీ (సూసైడ్ నోట్) లభ్యమైంది. అందులో “క్షమించు నాన్న.. కొరియా మా జీవితం, దానిని వదిలి మేము ఉండలేము” అని రాసి ఉంది. ముగ్గురూ కలిసి ఒకరి తర్వాత ఒకరు కిటికీ నుంచి కిందకు దూకడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
