కరీంనగర్‌లో లోటు వర్షపాతం: వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి.. కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్: వరికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు (చిరుధాన్యాలు), నూనె గింజలు, కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించాల‌ని కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు.

జిల్లాలో ఈసారి లోటు వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో, ‘ఎల్ నినో’ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. వానాకాలం సాగు, భవిష్యత్ కార్యాచరణపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పాల్గొన్నారు.

అనంతరం వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటి కొరత ఉన్నందున రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపేలా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ప్రోత్సహించాలని ఆదేశించారు.

రైతు వేదికల ద్వారా అవగాహన.. ఆరుతడి పంటలకే మొగ్గు!

కరీంనగర్ జిల్లాలో బావులు, బోరుబావుల కింద ఎక్కువ మొత్తంలో సాగు జరుగుతున్నందున, తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవడం ఉత్తమమని కలెక్టర్ సూచించారు.

  • పంటల మార్పిడి: వరికి ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు (చిరుధాన్యాలు), నూనె గింజలు, కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కల్పించాల‌ని అన్నారు.

  • క్షేత్రస్థాయి పర్యటనలు: వ్యవసాయ అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ వాతావరణ సమాచారాన్ని, సాంకేతిక సలహాలను రైతులకు అందించా ల‌ని చెప్పారు.

  • సమావేశాలు: ప్రతి రైతు వేదికను ఉపయోగించుకుంటూ, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వానాకాలం సాగుపై రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వాల‌ని వివ‌రించారు.

సన్న వడ్ల సాగుపై ప్రత్యేక దృష్టి.. ఆన్‌లైన్ ఎరువుల పంపిణీ

ప్రభుత్వం ప్రకటించిన క్వింటాకు ₹500 బోనస్ పొందాలంటే రైతులు ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్న వడ్లను మాత్రమే సాగు చేయాలని, ఈ సమాచారాన్ని ప్రతి రైతుకు చేరవేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో యూరియా, ఎరువుల కొరత లేకుండా ఆన్‌లైన్ విక్రయాల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలన్నారు.

శాఖల మధ్య సమన్వయం – కూలీలకు పనులు

నీటిపారుదల శాఖ అధికారులు నీటి లభ్యతను అంచనా వేస్తూ పక్కా ప్రణాళికతో నీటిని విడుదల చేయాలని, వ్యవసాయ శాఖతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించేందుకు వీబిజిరామ్ జి (ఉపాధి హామీ) పథకం కింద ఎక్కువ పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

“ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఎలాంటి వదంతులను నమ్మకుండా అధికారుల సూచనలు పాటించాలి” అని కలెక్టర్ చిత్రా మిశ్రా కోరారు.

also read 

వేములవాడలో దొంగల ముఠా గుట్టురట్టు.. చోరీల నియంత్రణపై పోలీసుల ఉక్కుపాదం!

అనుపురంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఆర్టీసీ బస్సు ఢీకొని మహారాష్ట్ర వలస కూలీ మృ*తి!

రైతులకు గుడ్ న్యూస్: ఇకపై ‘మీసేవ’ కేంద్రాల్లోనే యూరియా బుకింగ్.. ఎలాగో తెలుసుకోండి!

బెస్మెంట్ 600 చదరపు అడుగుల నిబంధన తప్పనిసరి,స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు