కోరుట్లలో కేడీ ముఠా గుట్టురట్టు: వృద్ధురాలిని మోసగించిన ముగ్గురు అరెస్ట్.. 24 గ్రాముల బంగారం స్వాధీనం
కోరుట్ల:
పెన్షన్ పెంచుతామని నమ్మించి వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు అపహరించిన ముగ్గురు సభ్యుల దొంగల ముఠాను కోరుట్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 24 గ్రాముల బంగారు గొలుసుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు కోరుట్ల సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
మోసం జరిగిందిలా..
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కు చెందిన అల్లేపు కృష్ణ (51), కుంచెపు శ్రీకాంత్ (30), అల్లేపు రాజ్ కుమార్ (28)లు ఒక ముఠాగా ఏర్పడి దొంగతనాలకు అలవాటు పడ్డారు. సొంత ప్రాంతంలో దొంగతనం చేస్తే త్వరగా దొరికిపోతామనే భయంతో ఈ నెల 15న కోరుట్లకు వచ్చి ఓ లాడ్జిలో దిగారు.
మరుసటి రోజు (16వ తేదీన) బస్టాండ్ వద్ద ఉన్న ఓ 70 ఏళ్ల వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు రూ.2,000 ఉన్న పెన్షన్ను రూ.4,000 కి పెంచుతామని నమ్మబలికి, స్థానిక స్టేట్ బ్యాంక్ వద్దకు తీసుకెళ్లారు. ఒంటిపై బంగారు ఆభరణాలు ఉంటే పెన్షన్ రాదని మాయమాటలు చెప్పి, ఆమె మెడలోని 24 గ్రాముల లక్ష్మీదేవి బిళ్ళల బంగారు గొలుసును తీసుకున్నారు. పెన్షన్ ఫారాలు తీసుకొస్తామని చెప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
లాడ్జిలోనే పోలీసులకు చిక్కిన దొంగలు:
బాధితురాలి సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. నిందితులు మరిన్ని దొంగతనాలు చేసేందుకు లాడ్జిలోనే బస చేయడంతో, విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారి వద్ద నుంచి బంగారం, శామ్సంగ్, రియల్మీ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
100కు పైగా కేసులు:
ఈ కేసులో ప్రధాన నిందితుడైన అల్లేపు కృష్ణపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో 100కు పైగా కేసులు నమోదైనట్లు సీఐ వెల్లడించారు. మిగతా ఇద్దరిపై కూడా పలు చోట్ల దొంగతనం కేసులు ఉన్నాయి.
