బాలుడి కిడ్నాప్‌, హ‌త్య కేసులో మ‌ర‌ణ శిక్ష మహమూబాబాద్‌ కోర్టు కీలక తీర్పు

మహబూబాబాద్ 

మూడేళ్ల క్రితం జరిగిన దీక్షిత్‌ రెడ్డి అనే బాలుడి హత్య కేసులో మహబూబాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మందసాగర్‌కు మరణశిక్ష విధించింది. కోర్టు తీర్పుపై దీక్షిత్‌ రెడ్డి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయ దేవత, పోలీసుల చిత్రపటాలకు వారు పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్‌ జిల్లాలో 2020 అక్టోబర్‌లో వసంత, రంజిత్‌ రెడ్డి దంపతుల కుమారుడు దీక్షిత్‌ రెడ్డి హత్య జరిగింది. స్థానికంగా పంచర్‌ షాప్‌ నిర్వహించే మందసాగర్‌ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. దాంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలులో పెట్టారు. ఈ కేసు విచారణ పూర్తి కావడంతో తాజాగా మహబూబాబాద్‌ జిల్లా కోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తున్నట్లు సంచలన తీర్పు వెలువరించింది. మూడేళ్ల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లిన మందసాగర్‌.. కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారులోని ధానమయ్య గుట్టపై హత్యచేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత అదే రోజు రాత్రి దీక్షిత్‌ రెడ్డి తండ్రి రంజిత్‌ రెడ్డికి ఇంటర్నెట్‌ ద్వారా ఫోన్‌ చేసి రూ.45 లక్షలు డిమాండ్‌ చేశాడు. రంజిత్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు మూడు రోజుల తర్వాత ధానమయ్య గుట్టపై దీక్షిత్‌ మృతదేహాన్ని కనిపెట్టారు. నిందితుడు మందసాగర్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *