రాయ్‌పూర్: మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ సృష్టించిన ఘోర భీభత్సం ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. దాదాపు రెండు గంటల పాటు స్టేట్, నేషనల్ హైవేలపై లారీతో చేజింగ్ సినిమాను తలపించేలా ప్రయాణించి, ఒక చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాడు. అడ్డువచ్చిన పోలీసు బారికేడ్లను బద్దలు కొడుతూ సాగిన ఈ హైడ్రామా చివరకు మహారాష్ట్ర సరిహద్దుల్లో ముగిసింది.
అసలేం జరిగిందంటే..?
మోహ్లా-మన్‌పూర్-అంబాఘర్ చౌకీ జిల్లా పరిధిలోని గుండెర్‌దేహి గ్రామంలో ఈ దారుణం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక లారీ, రోడ్డుపై వెళ్తున్న పూనమ్ (12) అనే బాలికను బలంగా ఢీకొట్టి, తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ప్రమాదంలో ఆ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత కూడా డ్రైవర్ లారీని ఆపకుండా మరింత వేగంగా పారిపోవడానికి ప్రయత్నించాడు.
मोहला-मानपुर जिले में शुक्रवार को एक शराबी ट्रक चालक ने बच्ची को रौंदने के बाद भागते हुए तीन थानों की पुलिस को छकाया। अंतत: 60 किमी दूर जाकर पकड़ा गया। @MMACDistrict_CG #Chhattisgarh #TruckDriver pic.twitter.com/aiI37j80kR
— Haribhoomi (@Haribhoomi95271) June 26, 2026
పోలీసు బారికేడ్లు ధ్వంసం.. తప్పిన ప్రాణాపాయం!
బాలికను గుద్ది లారీ పారిపోతోందన్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మోహ్లా పోలీస్ స్టేషన్ వెలుపల భారీ బారికేడ్లను ఏర్పాటు చేసి లారీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ అక్కడ పార్క్ చేసి ఉన్న మరో ట్రక్కును బలంగా ఢీకొట్టి, బారికేడ్లను ముక్కలు చేస్తూ మన్‌పూర్ వైపు దూసుకెళ్లాడు.
అక్కడితో ఆగకుండా, మన్‌పూర్‌లోని ఎస్‌డిఎమ్ (SDM) కార్యాలయం వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన రెండో చెక్‌పోస్టును కూడా లారీతో ఢీకొట్టాడు. ఆ బారికేడ్లను లారీ కిందే ఈడ్చుకుంటూ నేషనల్ హైవేపైకి ప్రవేశించాడు. బారికేడ్ల వెనుక నిలబడిన పోలీసులు క్షణాల వ్యవధిలో పక్కకు తప్పుకోవడంతో తృణప్రాయంలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
2 గంటల ఛేజింగ్.. సరిహద్దుల్లో అరెస్ట్
దాదాపు రెండు గంటల పాటు హైవేలపై లారితో భీభత్సం సృష్టించిన డ్రైవర్‌ను పోలీసులు వెంబడించారు. చివరకు మహారాష్ట్ర సరిహద్దుకు కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోర్కోట్టి గ్రామం వద్ద లారీని విజయవంతంగా అడ్డుకుని, నిందితుడైన డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. లారీని స్వాధీనం చేసుకున్నారు.
మృతదేహంతో రోడ్డుపై గ్రామస్థుల ఆందోళన
చిన్నారి పూనమ్ మరణవార్త తెలియడంతో గుండెర్‌దేహి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహంతో ఊగిపోయిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బాలిక మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి దాదాపు రెండు గంటల పాటు స్టేట్ హైవేని దిగ్బంధించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న సీనియర్ పోలీస్ అధికారులు అక్కడికి చేరుకుని, డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
