వారాంతం వచ్చిందంటే చాలు చికెన్, మటన్‌తో పాటు కోడిగుడ్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే ఈసారి ఆదివారం విందులో వినియోగదారుల జేబులకు చిల్లు పెట్టేందుకు చికెన్ కంటే కోడిగుడ్లే ముందు వరుసలో నిలిచాయి. గత మూడు నెలలుగా మార్కెట్‌లో గుడ్ల ధరలు నిరంతరాయంగా పెరుగుతూ ప్రస్తుతం రిటైల్ మార్కెట్‌లో ఒక్కో గుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.8 పలుకుతోంది. మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను గమనిస్తుంటే రాబోయే రోజుల్లో ఒక గుడ్డు ధర ఏకంగా పది రూపాయలకు చేరినా ఆశ్చర్యపోనక్కరలేదని పౌల్ట్రీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ నెలలో కేవలం రూ.4గా ఉన్న గుడ్డు ధర మే నాటికి ఐదు రూపాయలకు, జూన్ మొదటి వారంలో ఆరు రూపాయలకు చేరింది. కాగా ప్రస్తుతం నెలాఖరుకు వచ్చేసరికి ఏకంగా రూ.7.50 నుండి రూ.8 వరకు విక్రయమవుతోంది. నిత్యం ప్రోటీన్ కోసం ఆహారంలో గుడ్డును భాగం చేసుకునే మధ్యతరగతి, సామాన్య కుటుంబాలపై ఈ ధరల పెరుగుదల అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోంది.
పౌల్ట్రీ ఫారాల్లో తగ్గిన ఉత్పత్తి.. పెరిగిన ఎగుమతులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నాలుగు వేల లేయర్ పౌల్ట్రీ ఫారాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ సుమారు 4 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరుగుతుంది. ఇందులో సగం స్థానిక అవసరాలకు వినియోగిస్తుండగా, మిగిలిన సగాన్ని ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటారు. అయితే ఈ ఏడాది వేసవిలో ఎండల తీవ్రత విపరీతంగా ఉండటం వల్ల పౌల్ట్రీ ఫారాల్లో సుమారు 10 శాతం కోళ్లు మృతి చెందాయి. దీనివల్ల గుడ్ల ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోయింది. ఉమ్మడి జిల్లాల పరిధిలో రోజువారీ ఉత్పత్తి కావాల్సిన 80 లక్షల గుడ్ల స్థానంలో ప్రస్తుతం కేవలం 60 లక్షల గుడ్లు మాత్రమే వస్తున్నాయి. ఇందులో కూడా దాదాపు 30 లక్షల వరకు గుడ్లను మహారాష్ట్రకు ఎగుమతి చేస్తుండటంతో స్థానిక మార్కెట్‌లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
పెరిగిన పెట్టుబడి ఖర్చులు.. అంతర్జాతీయ కారణాలు
గుడ్డు ధరలు పెరగడానికి కేవలం స్థానిక కారణాలే కాకుండా అంతర్జాతీయ పరిస్థితులు కూడా తోడయ్యాయి. ఇరాన్ యుద్ధ వాతావరణం, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కోళ్ల మేత (దాణా), మందుల ధరలు విపరీతంగా పెరిగాయి. పౌల్ట్రీ నిర్వాహకుల సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒక కోడిగుడ్డు ఉత్పత్తి చేయడానికి మేత, ఔషధాల ఖర్చులన్నీ కలిపి దాదాపు రూ.7 వరకు అవుతోంది. పౌల్ట్రీ రైతులు హోల్‌సేల్‌గా వ్యాపారులకు ఒక్కో గుడ్డును రూ.6.05 చొప్పున అమ్ముతుండగా, అది రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.8 అవుతోందని తెలిపారు. గతంలో ఎగుమతులు తగ్గి తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన పౌల్ట్రీ రంగానికి ప్రస్తుత ధరలు కొంతవరకు ఉపశమనాన్ని ఇస్తున్నాయని పేర్కొన్నారు. దీనికి తోడు కోళ్లలో బరువు నియంత్రణ కోసం చేపట్టే ‘మౌల్టింగ్’ ప్రక్రియ వల్ల కూడా 15 నుండి 20 రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోవడం మార్కెట్‌ను దెబ్బతీసింది.
మధ్యాహ్న భోజన పథకంపై ప్రభావం
మార్కెట్‌లో ఒక్కసారిగా పెరిగిన ఈ ధరల ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకంపై కూడా తీవ్రంగా పడుతోంది. ఒకవైపు గుడ్ల ధరలు పెరగడం, మరోవైపు ప్రభుత్వం నుండి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో పాఠశాలలకు గుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్లు, నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి, వాతావరణం చల్లబడి కోళ్ల ఉత్పత్తి పెరిగితేనే ధరలు తగ్గుముఖం పడతాయని, లేనిపక్షంలో సామాన్యుడికి గుడ్డు మరింత దూరం కాక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఐదు రోజులు భారీ వర్షాలు!
15వేల లోపు స్మార్ట ఫోన్ల కోసం చూస్తున్నారా..? ఇవి చూడండి
