బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తిరిగేందుకు 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కేసీఆర్ కొనుగోలు చేశాడని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 22 కార్లకు గాను ఒక్కోదానికి రూ. 3 కోట్ల చొప్పున వెచ్చించాడని ఆరోపించారు. ప్రస్తుతం వాటిని బెజవాడలో దాచినట్టు తెలుస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు సంబంధించిన లోగోను సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణిని చూస్తే బీఆర్‌ఎస్ పాలకుల పనితనం తెలిసిందని ఎద్దెవా చేశారు. పదేళ్లలో వారు చేసింది శూన్యమని విమర్శించారు. ఈనెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన దరఖాస్తులను స్వీకరిస్తామని అన్నారు. గ్రామసభల్లో లేదా, గ్రామ పంచాయతీల్లో దరఖాస్తులను ఇవ్వొచ్చని సీఎం తెలిపారు. ప్రతి మండలంలో రెండు గ్రూపులు వుంటాయని, ఒక గ్రూప్‌కి ఎంపీడీవో, మరొక గ్రూప్‌కి తహసీల్దార్ బాధ్యత వహిస్తారని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వమే ప్రజలకు వస్తుందని అన్నారు. అలాగే ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట నిలబెట్టుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. టీఎస్‌పీఎస్సీలో అందరూ రాజీనామా చేశారని పేర్కొన్నారు. రాష్ట్రపతి అనుమతి వచ్చిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అనంతరం కమిటీని ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ఓడిపోయాక కేటీఆర్‌కు వింత వ్యాధి సోకిందని సెటైర్లు వేశారు. మంచానికి కట్టేసి వైద్యం చేయించాల్సి వస్తోందని చమత్కరించారు. సైనిక్ స్కూల్ వరంగల్ నుంచి తరలిపోయేందుకు కారణాలను చెప్పాలని ప్రశ్నించారు. మూడో సారి సీఎం అయ్యాక తిరిగేందుకు కేసీఆర్ 22 ల్యాండ్ క్రూయిజర్ కార్లు కొన్నారని విమర్శించారు. ఆ కార్లను విజయవాడలో దాచి పెట్టారని గుర్తుచేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విషయం తనకు తెలిసిందని వెల్లడించారు.
ప్రియుడిని ఇరికించబోయి దొరికిన యువతి