దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కేసులు కలవరపెడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 412 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ముగ్గురు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు భారత్‌లో 4170 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యక్టీవ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ వేగంగా విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, కేరళలో కేసులు పెరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో కేంద్రం అన్ని రాష్టాల్రను అప్రమత్తం చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని ఆదేశించింది. మంగళవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అధ్యక్షతన మహమ్మారి కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశ నిర్దేశం చేయనున్నారు. కాగా దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ తప్పదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు న్యూ ఇయర్ వేడుకలపై కరోనా ఆంక్షల ప్రభావం పడనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో వైరస్ ఉధృతి తగ్గకపోతే ఆయా రాష్టాల్ల్రో ప్రభుత్వాలు ఆంక్షలు అమలు చేసే అవకాశముంది.దేశంలో ఇప్పటి వరకు కరోనా కొత్త సబ్-వేరియంట్ ‘జేఎన్.1’ కేసులు 64 నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. వీటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటక 8, కేరళ 6, తమిళనాడు 4, తెలంగాణలో 2 కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా సోమవారం మరో 628 కరోనా కేసులు వెలుగుచూడగా మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 4,504కు చేరింది. కాగా, జేఎన్.1 వేరియంట్ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని వైద్యులు వివరిస్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం జేఎన్.1 తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు సోకిందని, ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని పేర్కొన్నారు.