ఇల్లంతకుంట (రాజన్న సిరిసిల్ల): వివాహం అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. ఒకరికొకరు తోడుగా ఉంటూ జీవితాంతం బాధ్యతలను పంచుకోవడం. సాధారణంగా పెళ్లిళ్లలో వరుడు వధువుకు బంగారు నగలు, ఖరీదైన కానుకలు ఇవ్వడం మనం చూస్తుంటాం. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఆదివారం జరిగిన ఒక వివాహ వేడుకలో వరుడు తన భార్యకు ఇచ్చిన గిఫ్ట్ చూసి పెళ్లికొచ్చిన వారంతా ఆశ్చర్యపోవడమే కాదు.. అతడి ఆలోచనను మనసారా అభినందించారు.
పెళ్లి పీటలపై ఇన్సూరెన్స్ బాండ్:
మండలానికి చెందిన హరీష్ కుమార్–నాగలక్ష్మిల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేదికపైనే వరుడు హరీష్ కుమార్.. తన నూతన జీవిత భాగస్వామి నాగలక్ష్మికి జీవితాంతం ఆర్థిక భరోసా కల్పించేలా ‘టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్’ (Term Life Insurance) పాలసీ బాండ్ పేపర్‌ను పెళ్లి కానుకగా అందజేశారు.
ఈ వినూత్న నిర్ణయంపై వరుడు హరీష్ కుమార్ మాట్లాడుతూ.. “జీవితంలో ప్రేమతో పాటు కుటుంబ భవిష్యత్తుకు ఆర్థిక రక్షణ కల్పించడం చాలా ముఖ్యం. రేపటి రోజున జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నా కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని నా భార్యకు కానుకగా ఇచ్చాను” అని భావోద్వేగంగా చెప్పారు.
ఘనంగా బాండ్ పేపర్ అందజేత:
టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (Tata AIA Life Insurance) కరీంనగర్ బ్రాంచ్ మేనేజర్ వీరస్వామి చేతుల మీదుగా వరుడు హరీష్ కుమార్ ఈ ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లను అందుకుని వధువుకు బహుకరించారు. ఈ వినూత్నమైన కార్యక్రమంలో టాటా ఏఐఏ బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్లు వి. శ్రీకాంత్, ఆర్. విజయ్ కుమార్, మరియు సీనియర్ బిజినెస్ అసోసియేట్ లీడర్ పుష్ప-అనిల్ కుమార్ లు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.
యువతకు స్ఫూర్తి.. సోషల్ మీడియాలో వైరల్:
ఈ కాలంలో ప్రతి కుటుంబానికి జీవిత బీమా రక్షణ ఎంత అవసరమో ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ తెలిసొచ్చేలా చేసింది. బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళికపై యువతలో అవగాహన పెంచేలా ఉన్న ఈ వినూత్న పెళ్లి కానుక ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా విపరీతంగా షేర్ అవుతూ చర్చనీయాంశంగా మారింది. “వివాహ బహుమతి అంటే కేవలం వస్తువు మాత్రమే కాదు… జీవితాంతం తోడుండే భద్రత కూడా” అంటూ స్థానిక ప్రముఖులు, నెటిజన్లు ఈ కొత్త జంటను కొనియాడుతున్నారు.
ఇవి కూడా చదవండి
టెక్ మార్కెట్లో సంచలనం: రేపే ‘నథింగ్ ఫోన్ (4b)’ లాంచ్.. ఐపీఎల్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక ‘RCB ఎడిషన్’!
తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్: వాయుగుండం ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు!
కరీంనగర్ మహిళను బావిలోకి తోసేసిన దారుణం వెనుక లోన్ యాప్‌ల వేధింపులు.. నిందితుడు డిగ్రీ విద్యార్థి!
