Hyderabad” హైదరాబాద్, జూలై 12: మియాపూర్ హఫీజ్‌పేట పరిధిలోని మార్తాండనగర్ కాలనీలో చోటు చేసుకున్న విషాద ఘటనలో నాలుగేళ్ల బాలుడు నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన శనివారం ఉదయం జరిగింది.
కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న శ్రీను, నీలా దంపతులు మార్తాండనగర్‌లో నివాసం ఉంటున్నారు. శ్రీను ఈరోజు ఉదయం పని నిమిత్తం బయటికి వెళ్లగా, అతని కుమారుడు అభి (వయసు 4) ఇంటి వద్దే ఆడుకుంటున్నాడు. ఆడుకునే క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న నీటి సంపు (పాత ట్యాంక్) తెరిచి ఉండడంతో, అప్రమత్తతలో అందులోకి పడిపోయాడు.
బాలుడు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు. చివరికి సంపులో పడిపోయిన విషయాన్ని గమనించగా, అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న స్థానికులు పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
స్థానికులు సంబంధిత అధికారులు, హౌసింగ్ సొసైటీ నిర్వహకుల నిర్లక్ష్యాన్ని తప్పుపడుతున్నారు. సంపు ఓపెన్‌గా ఉండటమే ప్రమాదానికి కారణమని అంటున్నారు. ఈ సంఘటనతో మార్తాండనగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
