Karimnagar outer ring road”కరీంనగర్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరంగల్–కరీంనగర్‌ను జంట నగరాలుగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

Karimnagar outer ring road” కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లాలో పలు కీలక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. చొప్పదండి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం, కరీంనగర్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు నిర్మిస్తామని ప్రకటించారు. అలాగే వరంగల్‌, కరీంనగర్‌లను జంట నగరాలుగా అభివృద్ధి చేసి, రెండు నగరాల మధ్య డంప్‌ యార్డు ఏర్పాటు చేసి విద్యుత్‌ ఉత్పత్తి చేపడతామని తెలిపారు.

2027లో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఆలయాలు, ఘాట్లను అభివృద్ధి చేస్తామని సీఎం చెప్పారు. ఎకో టూరిజాన్ని ప్రోత్సహించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు గత పాలకులు రాలేదని విమర్శిస్తూ, పేదల దేవుళ్లను దర్శించడానికే వారికి ఇబ్బందిగా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణను దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

రూ.45.15 కోట్లతో కరీంనగర్‌ జిల్లా రామడుగులో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటుకు సీఎం శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5 కోట్లతో గంగాధర మండలం మధురానగర్‌లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.

చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమ సమయంలో కరీంనగర్‌ గడ్డపై నుంచే సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణను సాధించారని అన్నారు.

గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారాన్ని అవకాశంగా మలచుకుని వేల కోట్ల సంపాదనకు పాల్పడ్డారని విమర్శించారు. పేదలకు కనీసం డబుల్‌ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్‌ కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌ అని వ్యాఖ్యానించారు.

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని, సన్నబియ్యం పంపిణీ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేశామని తెలిపారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్‌, పన్నెండేళ్లలో మోదీ పాలనలో ఏం చేశారో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన పనులు చెబితే ప్రత్యర్థుల గుండెలు పగిలిపోతాయని వ్యాఖ్యానించారు.

నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, వంద నియోజకవర్గాల్లో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని చెప్పారు. హాస్టల్‌ విద్యార్థులకు కాస్మొటిక్‌, డైట్‌ చార్జీలు పెంచామని తెలిపారు. చొప్పదండిలో డిగ్రీ కళాశాల నిర్మాణం చేపడుతున్నామని వెల్లడించారు.

రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి 25 లక్షల 35 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చామని, తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించామని చెప్పారు. కేవలం రైతుల కోసమే రెండేళ్లలో లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సీఎం వివరించారు. సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ అందిస్తున్నామని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీఎం తెలిపారు. ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కోసం రెండేళ్లలో రూ.9 వేల కోట్లు ఖర్చు చేశామని, మహిళలకు రూ.27 వేల కోట్ల రుణాలు అందించి వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మహిళలను ఆర్టీసీ బస్సుల యజమానులుగా మార్చామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *