Mitrabandham” శంకరపట్నం, జూన్ 13:
37 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థుల మధురానుభూతులను గుర్తు చేసుకుంటూ, మిత్రబృందం పునర్మిళకు రంగం సిద్ధమైంది. రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో 1987–88లో చదివిన పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన “మిత్రబృందం” ట్రస్ట్ ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ ఏడాది జూలై 7న ఒక ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు.
తెలంగాణ న్యూస్ ఎడిటర్ డి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థి దశలో కలిసిన మిత్రులు మళ్లీ ఒక చోటకి చేరి స్నేహ బంధాలను మరింత బలపరచుకోవాలన్నదే మిత్రబృందం ఉద్దేశమని చెప్పారు. మెట్టు రవీందర్, జక్కుల భూమయ్య, బట్టు సుధాకర్, నాగుల రాజేందర్, జోగు వెంకన్న, రామిడి కుమారులు తదితరులు ఈ ప్రయత్నానికి పునాదులు వేసినవారిగా గుర్తు చేశారు.
ప్రతి సంవత్సరం మిత్రబృందం వార్షికోత్సవాన్ని వివిధ ప్రదేశాల్లో నిర్వహిస్తూ వస్తోందని, ఈ ఏడాది ఆత్మీయ సమ్మేళనం మళ్లీ తమ పాఠశాల ప్రాంగణంలో జరగడం విశేషమన్నారు. గతం నాటి 100 మందికి పైగా విద్యార్థులలో, కొందరే బృందంలో చురుకుగా పాల్గొంటున్నారని పేర్కొంటూ, ఈసారి ప్రతి ఒక్కరు హాజరై మిత్రబృందానికి మద్దతుగా నిలవాలని కోరారు.
ఈ సమావేశంలో ట్రస్ట్‌ను మరింత అభివృద్ధి చేయడానికి సూచనలు, ఆర్థిక సహకారం అందించేలా బ్యాంకు ఖాతా ప్రారంభించేందుకు కమిటీ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
జూలై 7న రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో జరగనున్న ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని మిత్రబృందం సభ్యులు కోరుతున్నారు.
