శంకరపట్నం, కరీంనగర్ జిల్లా – శుక్రవారం నాడు శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన కనకం తిరుపతి మరియు రాజాపూర్ గ్రామానికి చెందిన చింతిరెడ్డి లింగారెడ్డి వేర్వేరు ద్విచక్ర వాహనాలపై ప్రయాణిస్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో లింగారెడ్డి రోడ్డుపై పడిపోవడంతో తలకు బలమైన గాయం ఏర్పడింది.
స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించగా, గాయపడిన లింగారెడ్డిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాద వార్త విన్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
