- 70 బైకులు, 10 లారీలు, 10 కార్లు,15 ట్రాక్టర్లు గల్లంతు
- 150 పశువులు చనిపోగా.. 600 పశువులు ఆచూకి లేదు..
- ఒక్క రాత్రిలో కకావికలం
నిన్న మొన్నటి నుంచి ముసురు పడుతోంది. మధ్య మధ్యలో భారీ వర్షం భయపెడుతుంది. వర్షం గురించే ఆలోచిస్తూ రాత్రి భోజన చేసి మొరంచపల్లి గ్రామస్తులు పడుకున్నారు . మరి కాసేపట్లో తెల్లవారతుందనగా మబ్బుల 4 గంటలకు పడుకున్న మంచాలు నీళ్లలో తేలుతున్నట్టు అనిపించాయి.. దీంతో ఒక్క సారిగా మొరంచపల్లి గ్రామం ఉలిక్కి పడింది. తలుపులు తీసి చూసి సరికి మోకాళ్ల లోతులో నీరు వేగంగా వస్తుంది. దీంతో అప్రమత్తమై తమ తమ కుటుంబీకులను నిద్రలేపి బయటపడాలని ప్రయత్నించారు. కానీ అంతలోపే వరద తీవ్రత పెరిగింది. ఐదుడుగుల వరకు రావడంతో ఉన్న ఉన్నచోటనే ఇండ్లపైకి ఎక్కారు. మరికొంత దొరికిన చెట్ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించారు. అసలు ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే తమలో కొంత మంది నీళ్లలో గల్లంతు అయ్యారు. ఎవరు ఉన్నారో ఎవరు లేరో కూడా అర్థం కాని పరిస్థితి. గ్రామస్తుల అర్థనాదాలతో తెల్లవారింది. ఈ భయకరమైన అనుభవాలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామస్తులవి. అసలు ఏం జరిగిందని ఏ మీడియా వాళ్లు, రాజకీయ నాయకులు అడిగినా వారి నుంచి కన్నీళ్లు తప్ప మాటల్లేవు.
285 ఇండ్లు,, 1900 జనాభా
285 ఇండ్లు, 250 కుటుంబాలతో 1900 జనాభాతో ఆ వూరు పచ్చని పైర్లతో కళకళాలాడేది. కానీ ఇదంతా ఒక నాటి కల. భీకర వానతో మొదలైన ఆ కాళ రాత్రి వారి కలలను కల్లలు చేసింది. కనీసం ఇప్పడు తినడానికి తిండిలేదు. చాలా వరకు ఇంటి గోడలు దెబ్బతిన్నాయి.. కొన్ని నాలుగు ఇండ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.. కొన్ని ఇండ్ల ప్రహరీ గోడలు కూలిపోయాయి. ఇంట్లోని బియ్యం బస్తాలు, ఎరువులు, వంట సామగ్రి దాచుకున్న డబ్బు, బంగారు ఆభరణాలు అన్ని ఆ రాత్రి నీళ్లలో కలిసిపోయాయి.. ఈ క్షణం ఎలాగడుస్తుందో.. రేపేంటో అన్న ప్రశ్నలే మదిని తొలిచి వేస్తుందని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు.
కొట్టుకుపోయిన వాహనాలు..
ఉప్పెనలా వచ్చిన వరదకు ఇండ్ల ముందు పార్క్ చేసి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి..70 బైకులు, 10 లారీలు, 10 కార్లు,15 ట్రాక్టర్లు గల్లంతయినట్టు సమాచారం. ఆ గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిపై ఉన్న 10 లారీలు గల్లంతు అయ్యాయి. వీటితో పాటు 600ల పశువులు గల్లంతు కాగా, 150 పశువులు మృత్యువాత పడ్డాయి.
ఉపాధి కరువు..
గ్రామంలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. కొంత మంది కార్లతో ఉపాధి పొందుతున్నారు. మరికొంత పశువులను సాదుకొని బతుకుతున్నారు. వరద ప్రవాహం వల్ల వ్యవసాయ భూముల్లో ఇసుక మేటలు వేసింది. పొలాల సరిహద్దు కూడా చేరిపివేయడంతో ఎవరి పొలం ఎక్కడుందో కూడా గుర్తు పట్టలేని స్థితిలో ఉంది. పంటలు నాటి ఇప్పుడిప్పుడే మొలక వస్తున్న తరుణంలో వరద రావడంలో మొక్కలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి నీళ్లలోనే పోయింది. వ్యవసాయ కూలీలకు కూడా ఉపాధి కరువు కానుంది. కార్లతో ఉపాధి పొందుతున్నవారి వాహనాలు వరదలో కొట్టుకపోవడం వల్ల వారి భవిష్యత్తు దిక్కుతోచని స్థితిలో ఉంది. మరోవైపు పశువులపైనే జీవనాధరం సాగిస్తున్న వారి బాధ వర్ణాణీతంగా ఉంది. ఉన్న పశువులు నీళ్లలో పోవడంతో రేపటి నుంచి ఎలా బతికేది దేవుడా అని రోదిస్తున్నారు.
ఇదీ ఒక్క రాత్రిలో కకావికాలమైన మొరంచపల్లి క.. న్నీళ్ల కథ ..