ట్రాఫిక్ రూల్స్‌పై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాలు
కరీంనగర్ |
ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.
గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ అండ్ బి, పోలీస్, రవాణా, ఆర్టీసీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులతో జిల్లా రోడ్డు భద్రత కమిటీ, జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, గత రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యల పురోగతిని రవాణా, పోలీస్, రోడ్లు భవనాలు, మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రాణ నష్టం జరగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రమాదాలు సంభవించే ప్రాంతాల్లో హెచ్చరిక సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని, వాహనాల వేగ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో కారణాలను విశ్లేషించి, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్, పోలీస్, రోడ్లు భవనాలు, రవాణా శాఖ అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని ఆదేశించారు.
ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సుల్లో తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ, కరీంనగర్–జగిత్యాల రహదారికి ఇరువైపులా ఆరు అడుగుల మేర చదును చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక సైన్ బోర్డులు, సరైన లైటింగ్ అవసరమని, సూచించిన ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్ల వివరాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించారు.
మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ, గత సమావేశంలో చర్చించిన విధంగా నగరంలో అవసరమైన ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ సిగ్నల్స్, సోలార్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ కీర్తి భరద్వాజ్ జాతీయ రహదారి 563పై ప్రమాదాల నివారణకు తీసుకున్న చర్యలను వివరించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఆర్టీసీ డీఎం సునంద, ఏసీపీ వెంకటస్వామి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
———————————————————————————————————
పదిలో నూరు శాతం ఫలితాలే లక్ష్యం
ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహించొద్దు
ప్రత్యేక అధికారులు స్కూళ్ల సందర్శనపై దృష్టి పెట్టాలి
విద్యాశాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరిక
కరీంనగర్
పదవ తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి పరీక్షల సన్నాహక సమావేశానికి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ప్రత్యేక అధికారులు, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీలు), మోడల్ స్కూల్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, పదవ తరగతి విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ప్రత్యేక అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని అన్నారు. అత్యవసర పరిస్థితులు తప్ప ఏ విద్యార్థికీ సెలవులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాలు, మోడల్ స్కూల్లలో చదువుతున్న ప్రతి విద్యార్థి పదవ తరగతి ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
చదువులో వెనుకబడిన విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించి, పిల్లలు ఉత్తీర్ణత సాధించేలా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రత్యేక తరగతుల నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రత్యేక అధికారులు పాఠశాల సందర్శనలో అలసత్వం చూపినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పాఠశాలల్లో ఏర్పాటు చేసిన స్నేహిత ఫిర్యాదుల పెట్టెల తాళాలను మహిళా పోలీసులకు అప్పగించాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల అవసరాలపై వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యాధికారి అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఇంకా సిలబస్ పూర్తికాని పాఠశాలలు ఉంటే వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పదవ తరగతి విద్యార్థుల సన్నద్ధత కోసం రూపొందించిన ప్లానింగ్‌ను ఆయా పాఠశాలలు అమలు చేస్తున్నాయా లేదా అనే అంశాన్ని ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని అన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
ఈ సమావేశంలో డీసీఈబీ కార్యదర్శి భగవంతయ్య, విద్యాశాఖ కోఆర్డినేటర్లు అశోక్ రెడ్డి, మిల్కూరి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
