
సమీక్ష సమావేశంలో అధికారులకు ఆదేశాలు
నేటి కరీంనగర్ | శంకరపట్నం |
తెలంగాణ కుంభమేళగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క–సారలమ్మ జాతరను భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి విజయవంతం చేయాలని హుజురాబాద్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) రమేష్ బాబు సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో జాతర నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమ్మక్క–సారలమ్మ గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్డీవో రమేష్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా శంకరపట్నం మండలంలోని తాసిల్దార్ కార్యాలయం సమీపంలో జరిగే జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. జాతరను విజయవంతంగా నిర్వహించి వనదేవతల కృపకు పాత్రులవ్వాలని అధికారులకు పిలుపునిచ్చారు.
భక్తుల సౌకర్యార్థం
-
తాగునీటి వసతి
-
స్నాన ఘాట్లు
-
మరుగుదొడ్లు
-
పారిశుధ్య నిర్వహణ
-
వైద్య సేవలు
సకాలంలో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జాతర విజయవంతానికి ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, తాసిల్దార్ సురేఖ, ఎంపీడీవో కృష్ణ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ ఖాదర్, ఎంపీఓ ప్రభాకర్తో పాటు విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, జాతర నిర్వహణ కమిటీ సభ్యులు, పూజారులు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తీర్ణత శాతం 100 శాతం సాధించాలి: పాఠశాలల ప్రత్యేక అధికారి భాగ్యలక్ష్మి
పదవ తరగతి ఫలితాలపై ఉపాధ్యాయులకు ఆదేశాలు

నేటి కరీంనగర్ | శంకరపట్నం |
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తోందని, రానున్న పదవ తరగతి పరీక్షల్లో 100కు 100 శాతం ఉత్తీర్ణత సాధించాల్సిందేనని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, పాఠశాలల ప్రత్యేక అధికారి జే. భాగ్యలక్ష్మి అన్నారు.
గురువారం కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, కన్నాపూర్ జిల్లా పరిషత్ పాఠశాల, ఎరడపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్యా బోధనలు, పాఠశాల ఆవరణలోని మౌలిక వసతులు, భోజన వసతులు తదితర అంశాలపై విద్యార్థులను, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని రికార్డులను పరిశీలించారు.
ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు కార్పొరేట్ విద్యా బోధనలను అందిస్తోందని తెలిపారు. రానున్న పదవ తరగతి కామన్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఫలితాలు తప్పనిసరిగా 100 శాతం ఉండాలని స్పష్టం చేశారు.
పదవ తరగతి ఉపాధ్యాయులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధనలు అందిస్తూ ఉత్తీర్ణత శాతాన్ని 100కు 100కు తీసుకురావాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అవసరమైన వసతులపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో విద్యార్థులకు కార్పొరేట్ వసతులతో పాటు నాణ్యమైన విద్యా బోధనలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్, కస్తూరిబా ఎస్ఓ, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చరితేష్ రూపొందించిన శకటం
విద్యార్థి ప్రతిభకు గుర్తింపు: ప్రధానోపాధ్యాయురాలు నీరజ

నేటి కరీంనగర్ | శంకరపట్నం |
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న వేడుకల్లో మొలంగూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి ముత్తునూరి చరితేష్ రూపొందించిన శకటం ప్రదర్శించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కంకణాల నీరజ గురువారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకల్లో శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి చరితేష్ రూపొందించిన శకటాన్ని ప్రదర్శించేందుకు జిల్లా అధికారులు నిర్ణయించినట్లు వెల్లడించారు.
విద్యార్థి చరితేష్ ప్రతిభకు లభించిన ఈ గుర్తింపు పాఠశాల ఉపాధ్యాయుల నాణ్యమైన విద్యా బోధనల ఫలితమని ఆమె అన్నారు. విద్యార్థులు తమ ప్రతిభను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించేందుకు ఉపాధ్యాయ బృందం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గణతంత్ర వేడుకల్లో మొలంగూర్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి రూపొందించిన శకటం ప్రదర్శించటం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని తెలిపారు.
ఈ సందర్భంగా చరితేష్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో, శ్రద్ధతో చదివి ఉపాధ్యాయులు అందిస్తున్న విద్యా బోధనలను సద్వినియోగం చేసుకొని ప్రతిభను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
చరితేష్ను గ్రామ సర్పంచి పూదరి రాజు, మండల విద్యాధికారి లక్ష్మీనారాయణ, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య… చింతగుట్ట గ్రామంలో విషాదం…
నేటి కరీంనగర్ :శంకరపట్నం
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, శంకరపట్నం మండలం, చింతగుట్ట గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం చింతగుట్ట గ్రామానికి చెందిన కర్క సురేందర్ రెడ్డి అనే వ్యక్తి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమార్తెలకు వివాహం చేయగా, ఆర్థిక ఇబ్బందులు నెలకొనడంతో, సురేందర్ రెడ్డి మనస్థాపానికి గురై, ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. కుటుంబ సభ్యుల బోధనలు, గ్రామస్తుల విషాద గాధల తో చింతగుట్ట గ్రామంలో విషాదం నెలకొంది. సురేందర్ రెడ్డి మృతి బాధాకరమని, ఆత్మశాంతి చేకూరి, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం కలిగించాలని, గ్రామ సర్పంచ్ కర్క చంద్రశేఖర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
