Rain Alert” శంకరపట్నం, డిసీ ప్రతినిధి:
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి కోరారు.
గురువారం ఆయన అర్కండ్ల వాగును పరిశీలించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, మండల పరిధిలోని అర్కండ్ల వాగు ఉధృతి ఎక్కువగా ఉందని తెలిపారు. ప్రజలు అవసరమైన సందర్భాల్లో మాత్రమే ప్రయాణాలు చేయాలని, వర్షాల కారణంగా విద్యుత్తు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయ బావుల వద్ద మోటర్లు వాడేటప్పుడు విద్యుత్ తీగలు తడిసి ప్రమాదం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని రైతులకు సూచించారు. అలాగే పాత ఇళ్లలో నివసిస్తున్న వారు వర్షాల కారణంగా ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించి అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరమైతే అధికారులు, పోలీసులకు సమాచారం అందిస్తే బాధిత కుటుంబాలకు తక్షణ పునరావాసం కల్పించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
