19.01.2026 నేటి శంక‌ర‌ప‌ట్నం వార్త‌లు

Mla kavvampally

కేశవపట్నంలో వనదేవతల కుంభమేళ పోస్టర్ ఆవిష్కరణ

నేటి కరీంనగర్ | శంకరపట్నం :
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రం కేశవపట్నంలో నిర్వహించనున్న తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిన మినీ మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర–2026కు సంబంధించిన గోడపత్రికలను మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదివారం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేశవపట్నంలో జరగనున్న సమ్మక్క–సారలమ్మ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం జాతర నిర్వహణ కమిటీ అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేస్తోందని తెలిపారు.

ఈ గోడపత్రికలను ఎల్ఎండీ తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించినట్లు ఆయన వివరించారు. జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో జాతర నిర్వహణ కమిటీ చైర్మన్ గుర్రం స్వామి, కమిటీ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మెట్టుపల్లి

గ్రామ శాఖ అధ్యక్షుడిగా మోరె సతీష్ నియామకం

నేటి కరీంనగర్ | శంకరపట్నం :
తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మెట్టుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా మోరె సతీష్‌ను ఏకగ్రీవంగా నియమించినట్లు సంఘం మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ ఆదివారం తెలిపారు.

కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో నిర్వహించిన సంఘ సమావేశంలో సభ్యుల సమక్షంలో ఈ నియామకం జరిగిందన్నారు. అనంతరం మోరె సతీష్‌కు నియామక పత్రాలను అందజేశామని తెలిపారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు అంతడుపుల సతీష్ మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయాలను గ్రామస్థాయిలో బలంగా తీసుకెళ్లేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సంఘాన్ని మరింత బలోపేతం చేయడంలో నూతన అధ్యక్షుడు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్సీ సీనియర్ నాయకులు అంతడుపుల రాజు, అర్జున్, అశోక్, నరేష్, ప్రశాంత్, రవి, స్వామి, క్యాదాసి అఖిల్, కోండ్ర శ్రీనివాస్, కొయ్యల సంపత్‌తో పాటు ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————————————-

సీపీఐ శతాబ్ది మహాసభకు ఖమ్మం తరలిన శంకరపట్నం పార్టీ శ్రేణులు

నేటి కరీంనగర్ | శంకరపట్నం :
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాల పూర్తి సందర్భంగా ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న శతాబ్ది ముగింపు సభకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వాహనాల్లో బయలుదేరి వెళ్లారు.

ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ, దేశ కార్మిక, కర్షక ఉద్యమాల కోసం నిరంతరం పోరాడిన సీపీఐ పార్టీ శతాబ్ది వేడుకలు చరిత్రాత్మకంగా జరగనున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న ఈ ముగింపు సభకు మండలం నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరవుతున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు సదానందం, గోదారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.


ఎన్టీఆర్ సేవలు యుగయుగాలకూ ఆదర్శం –

శంకరపట్నంలో ఘనంగా వర్ధంతి వేడుకలు

నేటి కరీంనగర్ | శంకరపట్నం :
పేదల పెన్నిధిగా పేరుగాంచిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, నటసార్వభౌములు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి వేడుకలను కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని సీనియర్ నాయకులు బైరి తిరుపతి, కదిరె కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ జెండా వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం అన్నదానం (పండ్లు పంపిణీ) చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ మోరె ప్రభాకర్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కిందన్నారు. పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో రెండు రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి, రాష్ట్రంలో సంక్షేమ పాలనకు నాంది పలికారని గుర్తు చేశారు.

గ్రామీణాభివృద్ధికి మండల, జిల్లా పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టి, మూడు అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థను అమలు చేశారని తెలిపారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, ఆయన సేవలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోడిశాల రాములు, బైరి తిరుపతి, కదిరె కొమురయ్య, దాసరపు సాగర్, మహమ్మద్ షాబీర్, వీరమల్లు, సమ్మయ్యతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *