నెల రోజుల క్రితం వరకు కిలో టమాటా ధర రూ.200 నుంచి రూ. 300 వరకు పలికింది. కొంత మంది రైతులు టమోటా పంటతో కోటీశ్వరులు కూడా అయ్యారు. టమాటా గురించి సోషల్ మీడియాలోనూ సైటైర్లు వేశారు. యాపిల్, టమాటను పోల్చుతూ ఎవరి టైంనా మారుతుంటదంటూ సందేశాలకు కూడా ఇచ్చారు. మరికొన్ని చోట్లా టమాట బాక్సులు ఎత్తుకెళ్లిన ఘటనలూ ఉన్నాయి. బాడిగార్డ్స్ లాంటి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.. అప్పుడు అట్లుంటే ఇప్పుడేం కొనేటోళ్లు లేరు. ఉంటే ఆకాశంలో లేకుంటే పాతాళంలో అన్నట్టు తయారైంది టమాట రైతుల పరిస్థితి. ఏదో అనుకుని సాగు చేస్తే ఏదో అయ్యిందని రైతులు బాధపడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఈ పంటను రోడ్ల పక్కన పడేయటం… పశువులకు పెట్టడం వంటివి జరిగాయి. కోత కూలీ కూడా రావడం లేదని కొందరు పొలంలోనే పంటను వదిలేస్తున్నారు. మార్కెట్‌కు పంపిస్తే రవాణా చార్జీలు కూడా రావని మరికొందరు రోడ్డు పక్కన పడేస్తున్నారు. కూలీలు, తోటకు కొట్టే మందుల ధరలు కూడా పెరగడంతో టమాటా రైతులకు పంట భారంగా మారిందని చిత్తూరు జిల్లా రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని ధరలే ఈ ఏడాది వచ్చాయని, చాలా మంది టమాటాలతో కోట్లు సంపాదించారని తెలిసి ఈ పంట వేసి నిండా మునిగామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోతకొచ్చేసరికి రేటు పడిపోయింది. సరఫరాకు తగిన డిమాండ్ లేకపోవడం వల్ల ప్రస్తుతం టమాటా ధర బాగా పడిపోయిందని చిత్తూరు జిల్లా ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ధరలు పెరగడం చూసి, ఇతర రైతులు బాగా సంపాదిస్తున్నారనే వార్తలు విని చాలా మంది టమాటా పంట సాగు చేస్తున్నారు. ఇలా వేసిన పంట భారీగా మార్కెట్లోకి రావడం వల్ల డిమాండుకు మించి టమాటా సరఫరా అవుతోంది. అందువల్ల రేట్లు పడిపోతున్నాయి. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో డిమాండుకు తగిన సరఫరా లేకపోవడంతో చిత్తూరు జిల్లాలో 30 కేజీల క్రేట్ దాదాపు రూ.4 వేలు పలికింది. అప్పుడు కిలో టమాటా దాదాపు రూ.150 వరకూ వచ్చింది. అది చూసే చాలా మంది రైతులు టమాటా వేశారు. ఏడాది పొడవునా టమాటా సాగు చేసే చిత్తూరు, అన్నమయ్య జిల్లాలతోపాటు కర్నాటకలోని కోలారు, చిక్‌బళ్లాపూర్ లాంటి ప్రాంతాల్లో కూడా టమాటా పంట వేశారు. దీనికి తోడు జూన్, జులైలో ఖరీఫ్ సీజన్లో టమాటా సాగు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా అనుకూలంగానే ఉంటుంది. ఫలితంగా ఎక్కడికక్కడ సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ఈ పంట అంత మార్కెట్‌లోకి వస్తుండటం వల్ల ధరలు పడిపోతున్నాయి. ధరలు పెరిగినపుడు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం, పడిపోతే పంటను ఆపివేయడం వంటివి చేయకూడదని రైతులు తెలుసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. ఏటా వేసవిలో టమోటాను ఎవరు సాగు చేస్తారో వారికి కచ్చితంగా మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది. ధరలు పెరిగిన సమయంలో భారీ విస్తీర్ణంలో పంట వేయటం మంచిది కాదు. మరీ ముఖ్యంగా టమాటా సీజనల్ క్రాప్ కాబట్టి, మార్కెట్ ట్రెండ్‌ను గమనిస్తూ పంటను వేసుకుంటే మంచిది. అలా చేస్తేనే రైతులకు లాభసాటిగా ఉంటుంది. నిజానికి, ఈ పరిస్థితి ఈ ఏడాది మాత్రమే లేదు. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు అంటున్నారు. పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు, సంబంధింత పరిశ్రమల్లో జ్యూస్, వడియాలు, పౌడర్ వంటి వాటిని తయారు చేయొచ్చు. టమోటాలు అందుబాటులో లేనప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదని అంటున్నారు.చిత్తూరు ప్రాంతంలో టమాటా ఆధారిత ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను పెట్టాలని కూడా చిత్తూరు జిల్లా రైతులు కోరుతున్నారు. ఇక, ప్రస్తుత టమాటా దిగుబడి విషయానికొస్తే..మరో రెండు నెలల వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని ఉద్యానవన శాఖ అధికారులు అంటున్నారు.