అపజయాలను జయించి.. కోచింగ్ లేకుండానే ‘జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌’గా నిలిచిన శంకరపట్నం యువకుడు!

శంకరపట్నం: లక్ష్యం వైపు అడుగులు వేసేటప్పుడు ఎదురయ్యే అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు మనిషిని వెనక్కి నెట్టలేవని నిరూపించాడు శంకరపట్నానికి చెందిన భూమా అరవింద్ ముదిరాజ్. ఒకేసారి నాలుగు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎస్ఎస్‌సీ సీజీఎల్ (SSC CGL) ద్వారా జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికై తెలంగాణ టాపర్‌గా నిలిచాడు. అరవింద్ సాధించిన ఈ అద్భుత విజయంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎలాంటి కోచింగ్ లేకుండా, సొంతంగా ఇంట్లోనే ఉండి చదివి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అరవింద్ ప్రయాణం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.

వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కుటుంబ నేపథ్యం చాలా సాధారణమైంది. తాతల కాలం నుండి ఆ వంశంలో ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం లేదు. తల్లిదండ్రులు భూమా వసంత, సంపత్‌లకు ఉన్న ఒకే ఒక్క ఎకరం పొలంతో, కులవృత్తి మరియు కూలి పనులు చేస్తూ అరవింద్‌ను బీటెక్ వరకు, కుమార్తె మౌనికను ఎం.ఫార్మసీ వరకు కష్టపడి చదివించారు. చిన్నప్పటి నుండి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ చెరువులకు చేపల వేటకు, వ్యవసాయ పనులకు వెళ్లే అరవింద్, చదువులోనూ ఎప్పుడూ ముందే ఉండేవాడు. బీటెక్ చదివే రోజుల్లోనే ఎన్నో ప్రైవేట్ కంపెనీల నుండి మంచి ప్యాకేజీలతో ఉద్యోగ అవకాశాలు (ప్లేస్‌మెంట్స్) వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా వాటిని తిరస్కరించాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడ దినసరి కూలీగా కొన్ని రోజులు కష్టపడినప్పటికీ, కన్నవారి కలలను సాకారం చేయాలంటే సొంత దేశంలోనే ప్రభుత్వ కొలువు సాధించాలని నిర్ణయించుకుని తిరిగి ఇంటికి వచ్చేశాడు.

ఇంట్లో ఉండి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో బంధువులు, చుట్టుపక్కల వారి నుండి ఎదురైన హేళనలు, అవమానాలను అరవింద్ తన విజయానికి ఇంధనంగా మార్చుకున్నాడు. ఎంతో పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా వారానికి ఒక సబ్జెక్టు చొప్పున పూర్తి చేస్తూ ప్రిపేర్ అయ్యాడు. దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది పోటీ పడిన ఈ కఠినమైన పరీక్షలో విజయం సాధించి, మొత్తం 14,500 మంది విజేతలలో ఒకడిగా గర్వంగా నిలిచాడు. రైల్వే శాఖతో పాటు మరో మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, తాను జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గానే విధుల్లో చేరతానని అరవింద్ స్పష్టం చేశాడు. విధి నిర్వహణలో నీతి, నిజాయితీలతో సేవలు అందిస్తూనే.. రాబోయే రోజుల్లో సివిల్స్ సాధించి ఐఏఎస్ (IAS) అధికారిగా తన తల్లిదండ్రులకు, పుట్టిన ఊరికి మరింత పేరు తీసుకురావడమే తన తదుపరి లక్ష్యమని అరవింద్ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. మధ్యతరగతి కష్టాలను అధిగమించి సిరిసంపదలను కాదని, ఆశయమే శ్వాసగా గెలిచిన అరవింద్‌ను స్థానిక ప్రజలు, రాజకీయ నాయకులు అభినందనలతో ముంచెత్తుతున్నారు.