Shankarapatnam ” శంకరపట్నం, డిసి ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసినదిగా, వారి హామీలన్నీ విఫలమైపోయిన నేపథ్యంలో, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశం ఆదివారం, కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలం వంకాయగూడెం శివారులోని మాధవ సాయి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు గంట మహిపాల్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన రసమయి బాలకిషన్ గారు…
“తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీ, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత పలు సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలిచింది. అయితే, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో అధికారం చేపట్టి, ప్రజలను మోసం చేసింది. ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతున్నా, మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలలో చాలా వరకు అమలు చేయలేకపోయారు,” అన్నారు.
జివి రామకృష్ణారావు (జివిఆర్) మాట్లాడుతూ…
“ప్రజలకు నైతిక స్పష్టత ఇవ్వాల్సిన అవసరం బీఆర్ఎస్ కార్యకర్తలపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలి,” అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖులు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సంజీవ రెడ్డి, హుజూరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అనుబంధ సంఘాల నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
