Molangur” శంకరపట్నం డిసి ప్రతినిధి | కరీంనగర్ జిల్లా
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో సోమవారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న తడిగొప్పుల సంపత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గ్రామస్తుల వివరాల ప్రకారం, సంపత్ ఓ ప్రైవేట్ సీడ్స్ కంపెనీలో దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే గత కొన్ని నెలలుగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ, మద్యానికి బానిసయ్యాడు. ఆదివారం మధ్యాహ్నం తన పాత ఇంటి వద్ద మద్యం సేవించి, అనంతరం క్రిమిసంహారక మందు సేవించాడు.
స్థానికులు ఈ విషయం గమనించి, ఆయన భార్య రాధాకు సమాచారం అందించగా, ఆమె వెంటనే 108 ఎమర్జెన్సీ సేవలను సంప్రదించింది. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం, సంపత్ పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి అతడు మృతి చెందాడు.
ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సంపత్ కుటుంబానికి ఇప్పుడు దహన సంస్కారాలను నిర్వహించేందుకు సైతం ఆర్థిక స్తోమత లేదు. భార్య రాధా, 9 సంవత్సరాల కుమారుడు శౌర్య వర్ధన్ తో సహా కుటుంబం తీవ్ర మానసిక, ఆర్థిక దుస్థితిలో ఉంది.
సహాయం చేయదలచిన వారు…
సేవాభావం కలిగిన దాతలు, మానవతా దృక్పథంతో ఈ కుటుంబానికి తోచినంత ఆర్థిక సహాయం అందించవచ్చు. దాతలు క్రింద పేర్కొన్న నంబరుకు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా సహాయం చేయవచ్చు:
PhonePe / Google Pay: 9032306973 (సంపత్ భార్య – రాధా)
మీ చిన్న సహాయంతో ఓ కుటుంబం తిరిగి నిలదొక్కుకునే అవకాశం పొందుతుంది.
