Hyderabad” ఉద్యోగ విరమణ ప్రభుత్వ ఉద్యోగుల జీవితంలో సహజం. కానీ, కొంతమంది అందించే సేవలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అటువంటి అరుదైన ఉద్యోగుల్లో ఒకరు హైదరాబాదులో రోడ్ సేఫ్టీ మల్టీ జోన్ ఏసీపీగా పదవి విరమణ పొందిన ఎం. నారాయణ.
కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో ఎస్సైగా తన ఉద్యోగ జీవితం ప్రారంభించిన నారాయణ, అహర్నిశలు ప్రజలకు అందించిన సేవలతో ఎంతో మంది గుండెల్లో స్థానం సంపాదించారు. ఆయన పదవి విరమణ సందర్భంగా హైదరాబాదులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ న్యాయవాది, ఎరడపల్లి గ్రామం మాజీ సర్పంచ్ చౌడమ్మల వీరస్వామి మాట్లాడుతూ – “నారాయణగారి సేవలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంకా ప్రజల జ్ఞాపకాలలో సజీవంగా ఉన్నాయి. పోలీసులు సేవా దృక్పథంతో పని చేస్తే ప్రజల గుండెల్లో స్థానం సంపాదించవచ్చు అనే విషయానికి నారాయణగారు నిజమైన ఉదాహరణ” అని ప్రశంసలు గుప్పించారు.
ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల వైస్ ఎంపీపీ కన్నాపూర్ గ్రామ మాజీ ఎంపీటీసీ మోతే ఎల్లారెడ్డి, సీనియర్ బీఆర్‌ఎస్ నాయకులు ఖాజా ఖలీల్‌ఉల్లా, న్యాయవాదులు ముద్దమల్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
చివరిగా, నారాయణగారి శేష జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండి, అదే చిరునవ్వుతో ప్రజల గుండెల్లో ఇంకా ఎన్నో సంవత్సరాలు నిలవాలని భగవంతుడిని కోరుకుంటున్నామని వీరస్వామి తెలిపారు.
