Vemulawada”రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ

భక్తుల విశ్వాసాలే పునాది

ఆలయాల అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ అంకితభావం

 – వేములవాడ

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధి, విస్తరణను భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేపడుతోందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి పారుదల, మహిళా–శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

శుక్రవారం వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్ బి.గీతే ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించి, కోడె మొక్కు అనంతరం భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గాయత్రి మాతను దర్శించుకుని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, అధిక సంఖ్యలో భక్తులు సందర్శించే ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ అంశాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌తో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్ బాబు‌, లక్ష్మణ్ కుమార్‌లు సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సీఎం స్వయంగా పరిశీలించి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు.

ప్రస్తుతం రూ.150 కోట్లతో రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్నాయని, వీటి పూర్తి అనంతరం భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, సులభ దర్శనం అందుబాటులోకి రానున్నాయని మంత్రి వెల్లడించారు.

మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల అభివృద్ధి వేగవంతం

మేడారంలో సమ్మక్క–సారలమ్మ జాతరకు సంబంధించి గద్దెల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివాసీ పూజారులు, భక్తుల సంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా గద్దెల పునర్నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ పనుల కోసం రూ.200 కోట్లకు పైగా నిధులు కేటాయించినట్లు వివరించారు.

ఈ నెల 18న మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులతో కలిసి క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు, 19న జాతర అభివృద్ధి పనులకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోందని, అందులో భాగంగానే తాను వేములవాడకు వచ్చినట్లు చెప్పారు. జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఆహ్వానించామని, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని మంత్రి కోరారు.

సీఎం ప్రత్యేక చొరవతో నిధులు – ఆది శ్రీనివాస్

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రూ.150 కోట్లతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. భక్తులకు వేగవంతమైన దర్శనం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వేములవాడ, మేడారం ప్రాంతాల అభివృద్ధికి సీఎం ప్రత్యేక శ్రద్ధ వహించడంతోనే భారీ నిధులు మంజూరవుతున్నాయని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రమాదేవి, ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీఓ రాధాభాయ్‌, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు, పట్టణ సీఐ వీరప్రసాద్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధికి శంకుస్థాపన

వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధి పనులకు రూ.1 కోటి నిధులతో శుక్రవారం మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పాల్గొన్నారు. ఈ జంక్షన్‌ను శివుడి థీమ్‌తో అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రెండు బడ్జెట్‌లలో కలిపి రూ.150 కోట్ల నిధులు మంజూరు చేసి వేములవాడ రాజన్న ఆలయ విస్తరణకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. సీఎం, మంత్రులు స్వయంగా హాజరై పనులు ప్రారంభించారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరంతర కృషితో వివిధ శాఖల నుంచి నిధులు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు.

పేదల దేవుడిగా పేరొందిన రాజన్న ఆలయ విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, పనులు పూర్తయిన తర్వాత భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

మేడారం సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణం

మేడారంలో సమ్మక్క–సారలమ్మ గద్దెల పునర్నిర్మాణ పనులకు రూ.200 కోట్లకు పైగా నిధులు కేటాయించామని మంత్రి వెల్లడించారు. ఆదివాసీ సంప్రదాయాలు, విశ్వాసాలకు భంగం కలగకుండా వందల ఏళ్లపాటు నిలిచేలా నిర్మాణాలు చేపడుతున్నామని తెలిపారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని గుర్తుచేస్తూ, భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు హాజరుకావాలని కోరారు.

మహిళా సంఘాలకు ప్రత్యేక ప్రోత్సాహం

జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో ఇందిరా మహిళా శక్తి భవనం నిర్మాణం జరుగుతోందని, మండల స్థాయిలోనూ భవనాల నిర్మాణానికి అవకాశం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. 60 ఏళ్ల వయసు దాటిన మహిళలు కూడా స్వయం సహాయక సంఘాల్లో చేరవచ్చని, అర్హులైన మహిళలంతా వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు, స్కూల్ యూనిఫార్మ్ కుట్టే బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించామని తెలిపారు. కోటి మంది మహిళలను కోటి ఈశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తాం – ఆది శ్రీనివాస్

ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. ఇప్పటికే రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.150 కోట్లు మంజూరు చేయగా, పట్టణంలో రోడ్డు వెడల్పు పనులకు రూ.47 కోట్లు వెచ్చిస్తున్నామని తెలిపారు.

మల్లారం జంక్షన్ నుంచి జగిత్యాల బస్టాండ్ వరకు సుందరీకరణ పనులకు రూ.2.65 కోట్లు, తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధికి రూ.1 కోటి మంజూరు చేశామని చెప్పారు. 28 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, అదనంగా రూ.4.20 కోట్ల పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

గుడి చెరువులో బోటింగ్ సౌకర్యానికి రూ.1.40 కోట్లు, దసరా సందర్భంగా మహాలక్ష్మి వీధి అభివృద్ధికి రూ.35 లక్షలు వెచ్చించినట్లు వెల్లడించారు. అన్ని కులాలు, మతాలకు సమాన న్యాయం చేస్తూ అభివృద్ధి కొనసాగుతోందన్నారు.

ఆలయ అభివృద్ధిలో భాగస్వామ్యం అదృష్టం – కలెక్టర్ గరిమ అగ్రవాల్

వీటీఏడీఏ వైస్ చైర్మన్‌, ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తిప్పాపూర్ జంక్షన్‌ను శివుడి థీమ్‌తో అభివృద్ధి చేస్తామని, ఆలయాలతో పాటు గుడి చెరువు, మున్సిపల్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు వీటీఏడీఏ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారు

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ రాకేష్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఆర్డీఓ రాధాభాయ్‌, తహసీల్దార్ విజయ ప్రకాశ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *