యూట్యూబర్ వైష్ణవి హ*త్య: ఆ అర్ధరాత్రి అసలేం జరిగింది..? భర్త హరిబాబు ఎక్కడికి పారిపోయాడు? వివ‌రాలు వెల్ల‌డించిన పోలీసులు

youtuber-vishnavi.

కోరుట్ల: అదనపు కట్నం కోసం కన్నెర్ర చేసిన ఓ భర్త, గర్భవతి అని కూడా చూడకుండా తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన కోరుట్ల నియోజకవర్గంలో సంచలనం సృష్టించింది. ప్రముఖ యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన చిత్తారి @ గంధం వైష్ణవి (20) హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడైన ఆమె భర్త హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రేమ వివాహం.. కట్నం వేధింపులు

మెట్‌పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు వెల్లడించిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవికి, కోరుట్ల పట్టణానికి చెందిన హరిబాబుకు గత ఏడాది మే నెలలో వెంకటాపూర్ దేవాలయంలో ప్రేమ వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కట్నం వద్దన్న హరిబాబు, వివాహం తర్వాత తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు.

  • పెళ్లి తర్వాత వైష్ణవి తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి ₹5 లక్షల నగదు, మాదాపూర్‌లో రెండు గుంటల భూమిని కట్నంగా తీసుకున్నాడు.

  • అయినప్పటికీ సంతృప్తి చెందక, అదనంగా మరో ₹5 లక్షలు కావాలని వైష్ణవిని శారీరకంగా, మానసికగా వేధించడం మొదలుపెట్టాడు.

  • వైష్ణవి మూడు నెలల గర్భవతి అని తెలిసినా వేధింపులు ఆపలేదు.

అర్ధరాత్రి కిరాతకం..

ఈ నెల 16వ తేదీ రాత్రి దంపతులిద్దరూ గదిలోకి వెళ్లిన తర్వాత తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘర్షణ జరిగింది. నిద్రలో ఉన్న వైష్ణవిపై హరిబాబు కత్తితో దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేశాడు. మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో ఏమీ తెలియనట్టు ముఖం కడుక్కుని తన మోటార్ సైకిల్‌పై పారిపోయాడు. వైష్ణవి తల్లిదండ్రులు గది తెరిచి చూడగా, ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది.

నిందితుడి పట్టుకున్న పోలీసులు

హత్య తర్వాత హరిబాబు రాయికల్, మైతాపూర్ ప్రాంతాల్లో సంచరించాడు. అనంతరం కొనరావుపేట ఎక్స్ రోడ్ సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని, రక్తపు మరకలున్న దుస్తులను దాచిపెట్టాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా, అతను నేరాన్ని అంగీకరించాడు.

“నిందితుడు హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాం. ఈ కేసులో హరిబాబు కుటుంబ సభ్యుల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నాం. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.” — అడ్లూరి రాములు, డీఎస్పీ, మెట్‌పల్లి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *