Shankarapatnam News”
శంకరపట్నం, కరీంనగర్ జిల్లా | డిసి ప్రతినిధి
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శంకరపట్నం మండల పరిషత్ అధికారులు మొలంగూర్ గ్రామంలో భూ వివాదంపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టారని ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మొలంగూర్ శివారులో కత్తుల రామక్క అనే మహిళ, పూదరి తిరుమల్ అనే వ్యక్తి వద్ద కొన్ని ఏళ్ల క్రితం సాదా భయానామా ద్వారా గృహనిర్మాణం కోసం భూమిని కొనుగోలు చేశారు. అయితే, సంబంధిత భూమి నరహరి మల్లారెడ్డి అనే వ్యక్తి పేరుతో రెవెన్యూ రికార్డుల్లో నమోదు కావడంతో ఆయన ఆ భూమిని తనదిగా పేర్కొంటూ హుజురాబాద్ కోర్టులో దావా వేశారు. కోర్టు నుండి ఇంజన్షన్ ఆర్డర్ కూడా పొందారు.
ఈ నేపథ్యంలో, రామక్క కరీంనగర్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయగా, కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఎంపీడీవో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఈ విచారణలో అర్జీదారురాలు రామక్క, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న మల్లారెడ్డి, గ్రామ పెద్దలు, మరియు స్థానికుల వాంగ్మూలాలు నమోదు చేసి, సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఎంపీడీవో కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, “విచారణ అనంతరం సంపూర్ణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందజేస్తాం. ఇరు వర్గాల వాదనలను సమగ్రంగా పరిగణలోకి తీసుకుంటాం,” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఫిర్యాదుదారురాలు రామక్క, నరహరి మల్లారెడ్డి, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
