Sankranthi Festval”
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన పండుగ మకర సంక్రాంతి. వివిధ ప్రాంతాల్లో దీనిని పొంగల్, లోహ్రీ, మాఘ బిహు, కిచ్డీ వంటి పేర్లతో జరుపుకుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో ఈ పండుగను నిర్వహించడం ఆనవాయితీ.
మకర సంక్రాంతి సౌర పంచాంగం ఆధారంగా ఉండే పండుగ కావడంతో సాధారణంగా ప్రతి ఏడాది దాదాపు ఒకే తేదీన వస్తుంది. చాలా కాలం పాటు జనవరి 14వ తేదీన సంక్రాంతిని జరుపుకున్నాం. అయితే 2008 సంవత్సరం నుంచి ఈ పండుగ తేదీ జనవరి 15కు మారింది.
దీనికి కారణం భూమి సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్యంలో జరిగే స్వల్ప మార్పులే. భూమి తన పరిభ్రమణ సమయంలో అతి చిన్న స్థాయిలో దిశ మారుస్తూ ఉండటంతో, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ప్రతి ఏడాది కొద్దిగా మారుతుంది. ఈ సమయ వ్యత్యాసం సగటున సుమారు 20 నిమిషాలు ఉంటుంది.
ఈ విధంగా ప్రతి ఏడాది వచ్చే చిన్న తేడాలు కలిపి సుమారు 72 సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు లేదా వెనక్కి జరగుతుంది. అందుకే 1935 నుంచి 2007 వరకు జనవరి 14న వచ్చిన సంక్రాంతి, 2008 నుంచి జనవరి 15కు మారింది.
అంచనాల ప్రకారం 2080 సంవత్సరం వరకు సంక్రాంతి జనవరి 15వ తేదీనే కొనసాగనుంది. అనంతరం 2081 నుంచి ఈ పండుగ జనవరి 16కు మారే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
