isro-scientist ” కొడిమ్యాల గ్రామానికి గర్వకారణమైన ముమ్మాడి రాజసింహ
| కొడిమ్యాల
పూర్వ కరీంనగర్ జిల్లా (ప్రస్తుతం జగిత్యాల జిల్లా) కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన యువకుడు ముమ్మాడి రాజసింహ ప్రతిష్ఠాత్మక భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO) లో సైంటిస్టుగా ఎంపికై గ్రామానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచారు.
గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు రాజశేఖర్, ఉమారాణి దంపతుల కుమారుడైన రాజసింహ, జగిత్యాలలో పదవ తరగతి పూర్తి చేసి, వరంగల్లో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం చేశారు. అనంతరం జేఈఈ అడ్వాన్స్ ద్వారా కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST) లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సులో సీటు సాధించారు.
బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా నేరుగా ఇస్రో సైంటిస్టుగా ఎంపిక కావడం విశేషం. రాజసింహ సాధించిన ఈ ఘనతపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, యువతతో పాటు అన్ని వర్గాల నుంచి అభినందనల వెల్లువ కొనసాగుతోంది.
