కరీంనగర్: ఉద్యోగాల సాధన కోసం కరీంనగర్ జిల్లా యువత హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇక్కడే ఉన్నత స్థాయి స్కిల్ డెవలప్‌మెంట్, ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా, శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ‘గ్రంథాలయ దినోత్సవం’ ఘనంగా జరిగింది. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్‌తో పాటు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ, కరీంనగర్‌లో విద్యారంగానికి అవసరమైన వనరులు సమృద్ధిగా ఉన్నాయన్నారు. బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతో సమన్వయం చేసుకుని జిల్లా గ్రంథాలయాన్ని ఒక నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు ప్రత్యేక కోచింగ్ ఇప్పిస్తామని వెల్లడించారు. యువతలో రీడింగ్ కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందని, పుస్తక పఠనం ద్వారానే వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు.
రూ.7 కోట్లతో నూతన భవనం సిద్ధం: మేయర్ కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ నిధులు రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన జిల్లా గ్రంథాలయ నూతన భవనం సిద్ధమైందని, త్వరలోనే దీనిని ప్రారంభిస్తామని ప్రకటించారు. గ్రంథాలయ అభివృద్ధికి నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహకారం ఉంటుందన్నారు. అనంతరం సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, యువత లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
పుస్తక పఠనమే జీవితాన్ని మారుస్తుంది: సత్తు మల్లేష్, అశ్విని తానాజీ చదువుకు మనిషి ఆర్థిక స్థితిగతులను మార్చే శక్తి ఉందని గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్ పేర్కొన్నారు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే తన విద్యార్థి దశను గుర్తుచేసుకుంటూ, పుస్తక పఠనం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖుల సమక్షంలో గ్రంథాలయంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్ అందించిన 8 కూలర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె. మహేశ్వర్, స్థానిక కార్పొరేటర్ పడాల శ్రీజ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సరిత, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బంగారం దొంగలు దొరికారు.. ‘ది గోల్డెన్ థీఫ్’ స్కెచ్.. దొంగతనానికి జీతాలు
