బెస్మెంట్ 600 చదరపు అడుగుల నిబంధన తప్పనిసరి,స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగులు

peddapalli

ప్రతి సోమవారం బిల్లుల విడుదల*

ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో పూర్తి పారదర్శకత 

పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

రామగుండం నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ

ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

రామగుండం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ 600 చదరపు అడుగులకు మించరాదని, స్లాబ్ ఏరియా 750 ఫీట్ లకు మించి కట్టకూడదని, అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణం చేపడితే కంప్యూటర్ ద్వారా బిల్లులు ఆమోదం పొందవని పెద్ద‌ప‌ల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష స్పష్టం చేశారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే ఉండడంతో ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ఆన్‌లైన్ విధానంలోనే జరుగుతోందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. బుధవారం ఎన్‌టీపీసీ కాకతీయ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రామగుండం నియోజకవర్గ స్థాయి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.

ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా..

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను ప్రభుత్వం కంప్యూటర్ ఆధారిత విధానంలో ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలుగా విభజించిందన్నారు. ఇంటి స్థలం ఉండి ఇందిరమ్మ గృహానికి అర్హులైన వారు ఎల్-1 జాబితాలో ఉంటారని తెలిపారు. ఇందిరమ్మ కమిటీ సిఫారసు చేసిన ఎల్-1 దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ లాగిన్ ద్వారా గెజిటెడ్ అధికారులు పరిశీలిస్తారని, అర్హత నిర్ధారణ అనంతరం మున్సిపల్ కమిషనర్ ద్వారా జిల్లా కలెక్టర్‌కు చేరుతాయని తెలిపారు. అనంతరం ఇన్‌చార్జి మంత్రి ఆమోదం పొందిన తర్వాత మాత్రమే మంజూరు ఉత్తర్వులు జారీ అవుతాయని, మొత్తం ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు.

ఎల్-1 జాబితాలోని 449 మంది.. 

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటివరకు ఎల్-1 జాబితాలోని 449 మంది అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అయితే వారిలో కేవలం 184 మంది మాత్రమే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారని తెలిపారు. ధర్మారం ప్రాంతంలో నిర్మాణాలు వేగంగా కొనసాగుతుండగా, రామగుండం ప్రాంతంలో పురోగతి ఆశించిన స్థాయిలో లేదన్నారు. మంజూరైన లబ్ధిదారులంతా వెంటనే ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని సూచించారు.

45 రోజులలోపు నిర్మాణం ప్రారంభించకపోతే..

నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరైన 45 రోజులలోపు నిర్మాణం ప్రారంభించకపోతే మంజూరును రద్దు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే రద్దు చేసే ముందు సంబంధిత ప్రజాప్రతినిధులు లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని, అనంతరం కూడా నిర్మాణం ప్రారంభించకపోతే ఆ ఇళ్లను రద్దు చేసి ఇతర అర్హులైన వారికి కేటాయిస్తామని స్పష్టం చేశారు.

నిర్మాణ బిల్లులు ప్రతి సోమవారం…

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ బిల్లులు ప్రతి సోమవారం క్రమం తప్పకుండా విడుదల అవుతున్నాయని, లబ్ధిదారులు నిర్మాణ పురోగతిని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే దానికి అనుగుణంగా చెల్లింపులు జరుగుతాయని తెలిపారు. ధర్మారం ప్రాంతంలో మంజూరైన సుమారు 500 ఇళ్లలో కేవలం ఏడు మినహా మిగిలిన వారంతా నిర్మాణాలు ప్రారంభించారని, రామగుండం ప్రాంతంలో మాత్రం నిర్మాణ పురోగతి చాలా తక్కువగా ఉందన్నారు.

ఇటీవల ప్రజాప్రతినిధుల ద్వారా అందిన 1,312 మంది లబ్ధిదారుల జాబితాలో విచారణ అనంతరం 607 మంది ఎల్-1 కేటగిరీలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ప్రస్తుతం వారి దరఖాస్తులు గెజిటెడ్ అధికారుల లాగిన్‌లో పరిశీలనలో ఉన్నాయని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు.

మరో 700 మంది ఎల్-2 కేటగిరీలో ఉన్నారని, వీరికి ప్రస్తుతం ఇంటి స్థలం లేదన్నారు. అయితే ఇంటి స్థలం ఉన్నట్లు సంబంధిత పత్రాలు సమర్పిస్తే వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి అర్హత నిర్ధారించిన అనంతరం ఎల్-1 కేటగిరీకి మార్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉంటుందని వివరించారు.
ఎల్-3 కేటగిరీలో గతంలో ప్రభుత్వ గృహ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారు ఉంటారని తెలిపారు. 2014కు ముందు ఇందిరమ్మ ఇళ్లు మంజూరై నిర్మాణం పూర్తికాని కుటుంబాలకు ప్రభుత్వం మరోసారి సహాయం అందించాలని నిర్ణయించిందన్నారు. బేస్‌మెంట్ స్థాయి వరకు మాత్రమే నిర్మాణం చేపట్టిన వారికి అక్కడి నుంచి నిర్మాణం పూర్తి చేసుకునేందుకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు.

అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తు చేసుకోని కుటుంబాలు..

అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తు చేసుకోని కుటుంబాలు మున్సిపాలిటీలోని ప్రజాపాలన కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆ దరఖాస్తులను హైదరాబాద్‌లో 360 డిగ్రీల పరిశీలన అనంతరం అర్హత నిర్ధారించి జిల్లాకు పంపిస్తారని, తర్వాత సాధారణ విధానంలో మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు.

గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యత

ప్రజాపాలనలో గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు తొలి ప్రాధాన్యతనిస్తూ గుడిసెలు లేని సమాజం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ట్రాన్స్‌జెండర్లు సహా వివిధ వర్గాలకు చెందిన సుమారు 500 కుటుంబాలకు ప్రభుత్వం భూ పట్టాలు ఇవ్వగా, వారిలో 27 మంది ఎల్-1 కింద, 190 మంది గృహాల కోసం దరఖాస్తు చేసుకున్నారని, మరో 270 మంది ఇంకా దరఖాస్తు చేయలేదన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, హౌసింగ్ పీడీ రాజేశ్వర్, తహసిల్దార్ రవీందర్ రావు, కార్పొరేటర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

aslo read

ఆ చార్జీలు ర‌ద్దు.. సామాన్యుడికి ఊర‌ట‌.. బ్యాంకుల‌కు రూ. కోట్ల న‌ష్టం

కరీంనగర్‌లో జులై 10న జాబ్ మేళా.. ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలో ఉద్యోగ అవకాశాలు!

రెండు హ‌త్య‌ల కేసులో వ్య‌క్తికి జీవిత ఖైదు శిక్ష‌.. వివ‌రాలు వెల్ల‌డించిన రాజ‌న్న సిరిసిల్ల ఎస్పీ