వైఫై కాదు… విల్ పవర్ పెంచుకోండి!
జాతీయ యువజన దినోత్సవంలో యువతకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపు
కరీంనగర్ | ప్రతినిధి
‘‘స్మార్ట్ ఫోన్‌కే పరిమితం కావొద్దు… స్మార్ట్ మనస్సును తయారు చేసుకోండి. వైఫై కాదు… విల్ పవర్ పెంచుకోండి. ప్రశ్నించే ధైర్యాన్ని పెంచుకోండి. అన్యాయం జరిగితే ఎదిరించే శక్తిని అలవర్చుకోండి. మీ కోసం మాత్రమే కాదు… దేశం కోసం బతకండి’’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ యువతకు పిలుపునిచ్చారు.
స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మేరా యువ భారత్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా యువజన అధికారి రాంబాబు, జిల్లా క్రీడల అధికారి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా పలువురికి స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు.
స్వామి వివేకానంద – యువతకు తారక మంత్రం
భారత దేశ ఖ్యాతిని ఖండాంతారాలు దాటించిన మహనీయుడు స్వామి వివేకానంద అని బండి సంజయ్ అన్నారు. యోగ, వేదాంత శాస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా, నిరాశలో ఉన్న యువతను తట్టి లేపిన గొప్ప వ్యక్తి ఆయన అని పేర్కొన్నారు.
‘‘నీ వెనుక ఏముంది… ముందు ఏముంది అనేది కాదు… నీలో ఏముంది అనేదే ముఖ్యం. మందలో ఒకరిగా కాకుండా వందలో ఒకరిగా నిలబడండి’’ అనే స్వామిజీ మాటలు యువతకు స్ఫూర్తినిస్తాయని అన్నారు.
‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత 100 మందిని ఇవ్వండి… దేశ తలరాతనే మార్చేస్తాను’’ అన్న స్వామి వివేకానంద మాటలు భారత యువత శక్తిపై ఆయనకున్న నమ్మకాన్ని చాటుతున్నాయని తెలిపారు.
నేటి యువత పరిస్థితి ఆందోళనకరం
నేటి యువత చేతిలో మొబైల్, ఇంటర్నెట్, ఆన్‌లైన్ గేమ్స్, మద్యం, డ్రగ్స్‌కు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటుంటే, మనం మాత్రం మోడరన్ కల్చర్ పేరుతో విదేశీ సంస్కృతిని అనుసరిస్తున్నామని విమర్శించారు.
దేశం కోసం బతికే ఆలోచన పెంచుకోండి
‘‘స్మార్ట్ ఫోన్ కాదు… స్మార్ట్ మనస్సును తయారు చేసుకోండి.
వైఫై కాదు… విల్ పవర్ పెంచుకోండి.
నీ కోసం కాదు… దేశం కోసం బతికే ఆలోచనను అలవర్చుకోండి.
ఈ దేశానికి బలహీనులు కాదు… బలవంతులు కావాలి’’ అని యువతకు సూచించారు.
వికసిత్ భారత్ – 2047 లక్ష్యం
1897లోనే తల్లి భారత మాత సింహాసనంపై కూర్చుని ఉన్న దృశ్యాన్ని చూశానని స్వామి వివేకానంద చెప్పారని గుర్తు చేశారు. అదే స్వామిజీ కలను నేడు ‘వికసిత్ భారత్ – 2047’ విజన్ డాక్యుమెంట్ రూపంలో ప్రధాని నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని తెలిపారు.
భారత్ ఆర్థికంగా 11వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగిందని, 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని పేర్కొన్నారు.
యువత, క్రీడలకు కేంద్రం ప్రాధాన్యత
యూపీఏ పాలనలో క్రీడల బడ్జెట్ రూ.1,640 కోట్లు మాత్రమే ఉండగా, మోదీ పాలనలో రూ.3,794 కోట్లకు పెంచామని తెలిపారు. దీని ఫలితంగానే ఒలింపిక్స్, కామన్‌వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో భారత్ ఎన్నో పతకాలు సాధించిందన్నారు.
ఉద్యోగాలు, స్టార్టప్స్, స్కిల్ డెవలప్‌మెంట్
-
ఒకే ఏడాదిలో 10 లక్షల మందికి మెరిట్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు
-
స్టార్టప్ ఇండియా ద్వారా 1.59 లక్షల స్టార్టప్స్ నమోదు
-
ఇప్పటివరకు 10 లక్షల మందికిపైగా ప్రత్యక్ష ఉద్యోగాలు
-
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా 10 ఏళ్లలో 1.70 కోట్ల మందికి స్కిల్ ట్రైనింగ్
యువతకు పిలుపు
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, భవిష్యత్తుకు స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ పెడ్లర్లపై సమాచారం ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు.
‘‘మీ లోని బలహీనతలను విడిచిపెట్టండి.
భయాన్ని మనసులోకి రానీయకండి.
భారతీయుడిగా గర్వంగా నిలబడండి.
అదే స్వామి వివేకానందుడికి మనం అందించే నిజమైన నివాళి’’ అని బండి సంజయ్ తన ప్రసంగాన్ని ముగించారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి
అధికారులకు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశం
కరీంనగర్
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇచ్చి వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు.
సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబులతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అందిన దరఖాస్తుల్లో కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.
మొత్తం 249 దరఖాస్తులు స్వీకరణ
ఈ ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 249 దరఖాస్తులు అందాయి. ఇందులో అత్యధికంగా
-
హౌసింగ్ శాఖకు – 43 దరఖాస్తులు
-
కరీంనగర్ నగరపాలికకు – 42 దరఖాస్తులు
సంబంధిత శాఖల అధికారులు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.
