Shankarapatnam”
శంకరపట్నం, కరీంనగర్ జిల్లా | మంగళవారం:
తెలంగాణ బీజేపీలో బీసీలకు కనీస గౌరవం లేకపోవడాన్ని ఖండించిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొంగోని శ్రావణ్ గౌడ్, బీజేపీలో ఉన్న బీసీ నాయకులు తక్షణమే పార్టీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
శంకరపట్నం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ, బీజేపీ బీసీలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తామని బీజేపీ ఇచ్చిన హామీని విస్మరించి, అగ్రవర్ణాల నాయకుడికి పదవిని అప్పగించడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో 60% జనాభా ఉన్న బీసీలను పక్కన పెట్టి, కేవలం 1% అగ్రవర్ణానికి ప్రాధాన్యత ఇచ్చిన బీజేపీ ద్రోహపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్న బీజేపీ, చివరకు ఫ్లోర్ లీడర్ పదవిని కూడా అగ్రవర్ణానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిందని విమర్శించారు. ఇది బీజేపీ మాటలు, చేతలు కుదరకపోయిన ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రావణ్ గౌడ్ కఠినంగా విమర్శిస్తూ, “బీజేపీ అంటే ఇప్పుడు బ్రాహ్మణ జనతా పార్టీ అయిపోయింది. బీసీలను మోసం చేసిన ఈ పార్టీని ఇకపై బీసీల ద్రోహిగా పరిగణించాలి,” అని పేర్కొన్నారు.
వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పి, రాజకీయంగా భూస్థాపితం చేస్తారని ఆయన హెచ్చరించారు.
