అయ్యో త‌ల్లీ.. మూడేళ్ల కొడుకుతో కలిసి బావిలో దూకి తల్లి ఆ*త్మహ*త్య

 రాజన్న సిరిసిల్ల జిల్లా: ఇల్లంతకుంట మండలం రంగపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భర్త వేధింపులు, కుటుంబ కలహాలు తాళలేక ఓ తల్లి తన మూడేళ్ల చిన్నారిని వ్యవసాయ బావిలో వేసి, తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఘటన వివరాలు:

రంగపేట గ్రామానికి చెందిన ఎలవేణి రేఖ (25) కు ఐదేళ్ల క్రితం ఇల్లంతకుంట మండలం కేంద్రానికి చెందిన దుర్ముట్ల బాబుతో వివాహమైంది. వీరికి విఘ్నేశ్ (3) అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లి సమయంలో బాబును రేఖ తల్లిదండ్రులు ఇల్లరికం తీసుకొచ్చారు. కొంతకాలం దుబాయ్‌లో ఉండి వచ్చిన బాబు, ఆ తర్వాత మద్యానికి బానిసయ్యాడు.

కలహాలే కారణమా?

మద్యం మత్తులో భార్యతో తరచూ గొడవ పడుతుండటంతో, మనస్పర్థలు పెరిగి బాబు తన తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రేఖకు, ఆమె తల్లి రాజవ్వకు మధ్య కాపురం విషయంలో గొడవ జరిగినట్లు సమాచారం. జీవితంపై విరక్తి చెందిన రేఖ, బుధవారం సాయంత్రం తన సొంత వ్యవసాయ బావి వద్దకు వెళ్లింది.

  • ముందుగా మూడేళ్ల కుమారుడు విఘ్నేశ్ను బావిలో పడేసింది.

  • ఆ తర్వాత తానూ దూకి ప్రాణాలు తీసుకుంది.

పోలీసుల దర్యాప్తు:

బావిలో పడిన శబ్దం విని స్థానిక రైతులు వచ్చి చూసేసరికి తల్లి, కుమారుడు విగతజీవులుగా కనిపించారు. గ్రామ సర్పంచ్ మేడిపెల్లి భాస్కర్ రెడ్డి సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికితీసి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.