గంగాధర లో 2026-27 విద్యా సంవత్సరంలో డిగ్రీ కళాశాల ప్రారంభం.. నూతన ప్రవేశాలకు అవకాశం

  • వెంటనే డిగ్రీ తరగతులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశం

  • జూనియర్ కళాశాల భవనంలో వసతుల ఏర్పాటుకు వారం రోజుల గడువు

  • ప్రవేశాలు పెరిగేలా గ్రామాల్లో డప్పు చాటింపు వేయించాలి

  • కళాశాల శాశ్వత స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్

గంగాధర, జూలై 14: గంగాధర మండలంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల అవకాశాన్ని పరిసర ప్రాంతాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ స్థానిక శాసనసభ్యులు (చొప్పదండి ఎమ్మెల్యే) మేడిపల్లి సత్యం సహకారంతో మంజూరైన ఈ డిగ్రీ కళాశాలలో తరగతులను వెంటనే ప్రారంభించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

మంగళవారం గంగాధరలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణాన్ని కలెక్టర్ సందర్శించారు. ప్రస్తుతం ఈ జూనియర్ కళాశాల భవనంలోనే నూతన డిగ్రీ తరగతులను తాత్కాలికంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కళాశాల గదులను, మౌలిక వసతులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారం రోజుల్లోగా అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

నాణ్యమైన విద్యే లక్ష్యం.. డ్రాపౌట్స్ ఉండొద్దు

ఈ డిగ్రీ కళాశాలలో BA, BCom, BSc కోర్సులకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. సమీప ప్రాంతాల్లో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులంతా ఇక్కడ అడ్మిషన్లు పొందేలా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. నూతన కళాశాల గురించి పరిసర గ్రామాల్లోని ప్రజలకు తెలిసేలా డప్పు చాటింపు ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు.

కళాశాలలో విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్ ల్యాబ్, ఇతర వసతులను వెంటనే సమకూర్చాలన్నారు. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా బోధన సాగాలని, విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేయకుండా (డ్రాపౌట్స్ లేకుండా) అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో గంగాధర కళాశాల ఇతర పోటీ కళాశాలలకు దీటుగా ఎదగాలని ఆమె ఆకాంక్షించారు. అలాగే కళాశాల భవనానికి ప్రహరీ గోడ నిర్మాణం, ఇతర మరమ్మతులపై పూర్తి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

శాశ్వత భవన స్థల పరిశీలన

గంగాధరలోని మధురానగర్ లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల శాశ్వత భవన నిర్మాణం కోసం కేటాయించిన స్థలాన్ని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో కలిసి పరిశీలించారు. స్థలానికి సంబంధించి పలు సూచనలు చేశారు.

హాజరైన ప్రముఖులు

ఈ కార్యక్రమంలో గంగాధర తహసీల్దార్ రజిత, ఎంపీడీవో రాము, ఇంటర్మీడియట్ విద్యాధికారి వి. ఆంజనేయరావు, ఎస్.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రామకృష్ణ, జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ సత్యనారంజనేయ, సర్పంచ్ వేముల భాస్కర్ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులు వేగవంతం చేయండి
కలెక్టర్ చిత్రా మిశ్రా

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. చొప్పదండి మండలం రుక్మాపూర్ లో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంగళవారం.. అధికారులతో కలిసి పరిశీలించారు.

పనులను విభజించి పూర్తి చేయాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పనులను చిన్న చిన్న భాగాలుగా విభజించి పూర్తిచేయాలని సూచించారు. నిర్మాణ పరిసరాలను కలియ తిరుగుతూ సంబంధిత శాఖ అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.

కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు:
ఈ కార్యక్రమంలో చొప్పదండి తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో వేణుగోపాల్ టీజీ ఈడబ్ల్యూఐడీసీ ఈఈ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. …………………………………………………………………………………………

పది రోజుల్లోగా పెండింగ్ పనులు పూర్తి చేయండి
చొప్పదండి ఏరియా(వంద పడకల) ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్ చిత్రా మిశ్రా

ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం

చొప్పదండి ఏరియా(వంద పడకల) ఆసుపత్రిలో పెండింగ్ పనులను పది రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా.. అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి లోని ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ .. అధికారులతో కలిసి సందర్శించారు.

విద్యుత్, ఎలక్ట్రిక్ పనులు పూర్తి చేయాలి
ఈ సందర్భంగా కాంట్రాక్టర్, డీజీహెచ్ఎస్ కృష్ణ ప్రసాద్, టీజీఎంఐడీసీ అధికారులకు పలు సూచనలు చేశారు. పరిసరాలు తిరుగుతూ పెండింగ్ లో ఉన్న విద్యుత్, ఎలక్ట్రిక్ తదితర పనులను పూర్తిచేసి.. ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు:
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నవీన్ కుమార్, ఎంపీడీవో వేణుగోపాల్, ఈఎంటీ బృందం అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.